ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటాం

ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటాం– సీపీఐ(ఎం) బృందంతో భేటీ సందర్భంగా ఈసీ హామీ
– బీజేపీ అక్రమాలను వివరించిన సుభాషిణీ అలీ, మురళీధరన్‌
న్యూఢిల్లీ : బీజేపీపైనా, ఆ పార్టీ ప్రధాన ప్రచారకర్తలపైనా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) చేసిన పలు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సానుకూలంగా స్పందించింది. ఫిర్యాదులను పరిశీలించి నిబంధ నలు ఉల్లంఘించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మురళీధరన్‌ సోమవారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధానకార్యాలయానికి వెళ్లి ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్లతో సమావేశమయ్యారు. బీజేపీ అధ్యక్షులు, ఆ పార్టీకి చెందిన ఇరత ప్రచారకర్తలపై సిపిఎం ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి వివరించారు. ముఖ్యంగా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు పదేపదే విద్వేష ప్రసంగాలు చేస్తుండటంపైనా, అవాస్తవాలను చెబుతూ ప్రజలను చీల్చి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ పన్నుతున్న కుయుక్తలపైనా ఎన్నికల కమిషనర్ల వద్ద సీపీఐ(ఎం) ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు వాస్తవాలను తొక్కిపెట్టి అవాస్తవాలను ప్రచారం చేస్తూ బీజేపీ విద్వేష పూరిత కుట్రలకు వంత పాడుతున్న కొన్ని టీవీ వార్తా ఛానెళ్లు, మీడియా సంస్థల పాత్రపైన కూడా సీపీఐ(ఎం) నేతలు ఎన్నికల సంఘం ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి నేతలపైనా, సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించింది. ఈ ఫిర్యాదుల పట్ల ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని, ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామన్న హామీ ఇచ్చిందని ఈసీలతో సమావేశం అనంతరం సీపీఐ(ఎం) నేతలు పేర్కొన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సహా ఆ పార్టీకి చెందిన ప్రధాన ప్రచారకర్తలు ఎన్నికల ప్రచార సభల్లో విద్వేష ప్రసంగాలు చేయడం, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మైనార్టీలు వంటి అణగారిన తరగతులకు చెందిన ప్రజలకు అందుతున్న రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడం, తొలి, మలి విడత పోలింగ్‌ జరిగిన త్రిపుర వంటి చోట్ల బీజేపీ అక్రమాలకు పాల్పడటం వంటి ఘటనలపై సీపీఐ(ఎం) ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.

Spread the love