– రాత్రి 9 – 1 గంట వరకే అనుమతి
– స్టాండ్స్ రోడ్లకు రాకుతూ డ్రైవ్ చేస్తే కేసులు
– 144 సెక్షన్ అమలు.. జనం గుమికూడొద్దు
– డ్రంకన్ డ్రైవ్ నిబంధనలు కఠినతరం
– ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ బి. శ్రీనివాసులు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం ప్రజలు ఆనందంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నూతన సంవత్సరాన్ని స్వాగతించాలని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ బాణాల శ్రీనివాసులు సూచించారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. రోడ్లపై గుమికూడొద్దని తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ నిబంధనలు కట్టిన తరం చేసినట్లు చెప్పారు. యువకులు స్టాండ్స్ రోడ్లకు తాకేలా బైక్ లను ర్యాష్ గా నడుపుతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 31, జనవరి 1 నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఎలా వ్యవహరించాలో మంగళవారం ఏసీపీ పలు సూచనలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి 1 గంటలోపే వేడుకలను ముగించుకొని గమ్యస్థానాలకు చేరాలని సూచించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకన్ డ్రైవ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలిపారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యలో జన సమర్థ ప్రాంతాలలో గట్టినిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలోని మమతా రోడ్, ఇల్లందు క్రాస్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, పాత బస్టాండ్ సెంటర్, కాల్వొడ్డు, జడ్పీ సెంటర్ తదితర ప్రాంతాల్లో పోలీస్ నిఘా ను మరింత పకడ్బందీగా చేపట్టనున్నట్లు తెలిపారు. హైవే పైనా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా షాపుల నిర్వాహకులుదేనని తెలిపారు. రోడ్లపై టెంట్లు వేయడం, కేకులు కట్ చేయడం వంటి చర్యలు నిషిద్ధం అని తెలిపారు. లా అండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా గస్తీని మరింత పగడ్బందీగా నిర్వహించేలా కృషి చేస్తారని వెల్లడించారు. బాలికల హాస్టల్స్ వద్ద ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి నూతన సంవత్సర వేడుకలను ఆనందకరమైన రీతిలో నిర్వహించుకోవాలని కోరుతూ నగర ప్రజలకు ఏసీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.