– ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
– కాంగ్రెస్ చేవెళ్ల ఇన్‌చార్జి పామేనా భీమ్ భరత్
నవతెలంగాణ-శంకరపల్లి
పేదల భూములు ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి శిక్ష పడే విధంగా ప్రజల పక్షాన నిలుస్తామని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం ఇన్‌చార్జి పామేనా భీమ్ భరత్ అన్నారు. శంకర్పల్లి మండలంలోని పీర్లగుట్ట భూమి చందిప్పలోని పీర్లగుట్టను ఆదివారం ఆయన గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీర్ల గుట్ట అని పిలవబడే ఈ భూమి మొత్తం 8- 30 ఎకరాలు ఉండగా, గతంలో ప్రభుత్వం గ్రామానికి చెందిన బుచ్చయ్యకు 1 ఎకరా భూమిని అసైన్ పట్టాగా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. మిగతా 7-30 ఎకరాల భూమి గ్రామస్తుల అవసరాల కోసం ఉపయోగపడుతుండగా అందులో దుర్గమ్మ గుడి, దర్గా, ముస్లింల సమాధులు, పశువులు నీళ్లు తాగేందుకు ప్రభుత్వం హౌస్ కట్టించడం జరిగిందని తెలిపారు. ఉన్నపలంగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇనాం దారులమనే ముసుగులో కోట్లు సంపాధించాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పీర్లగుట్ట గురించి ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండి పీర్లగుట్టను ఉమ్మడి ఆస్తిగా భావించాలని సూచించారు. ఈ కుట్ర కోణం వెనుక బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సూత్రధారులు పాత్రధారులు ఉన్నారనే విషయం తెలిసింది. శంకర్‌పల్లి మండల స్థాయి నాయకుడు ఈ తతంగం వెనుక ఉన్నాడనే విషయం స్పష్టమవుతున్నది, అతనికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గ్రామస్తులు భయపడాల్సిన, విచారించాల్సిన అవసరం లేదని మీకు నేనున్నానంటూ ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లావని పట్టా, పోరంబోకు భూములపై సాగు చేస్తున్న రైతులకు పూర్తి అధికారాలు ఇవ్వమని ఉందని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిహెచ్ స్వప్నమోహన్, టీపీసీసీ కార్యదర్శి ఉదయ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ భాస్కర్, నాయకులు మైసయ్య, సదానంద్ గౌడ్, దేవేందర్ రెడ్డి, శేరి అనంతరెడ్డి, ప్రశాంత్, మండల మైనార్టీల అధ్యక్షులు మహబూబ్ హుస్సేన్, కొండకల్ పెంటయ్య, కిష్టయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు.