న‌ట శిరోమ‌ణి క‌న్నాంబ‌

Actress Shiromani Kannambaసినీ రంగం అంటేనే కత్తి మీద సాము. అందులోనూ ఎటువంటి పరిచయాలు, కుటుంబ నేపధ్యం లేని వారు ఈ రంగంలో రాణించాలంటే మామూలు విషయం కాదు. ఇక మహిళలు అవకాశాలు దక్కించుకోవాలంటే మరింతగా శ్రమించాల్సి వుంటుంది. సినీ రంగం రంగుల ప్రపంచం కాకముందు కేవలం నలుపు తెలుపులో మాత్రమే చిత్రాలు నిర్మించేవారు. ఆ సమయంలో ఈ రంగంలోకి మహిళలు అడుగుపెట్టడమే మహా అద్భుతం. అలాంటిది ఒక మహిళ నాటక రంగం నుండి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తన సహజమైన నటనతో తనకంటూ ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. నేటి తరం తారలకు స్ఫూర్తిగా నిలిచింది. గొప్ప నటుల పక్కన నటించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ నటి మరెవరో కాదు పసుపులేటి కన్నాంబ. ఈ రోజు ఆమె వర్ధంతి సందర్భంగా….
కన్నాంబ పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకొచ్చేది లవకుశలో ఆమె పోషించిన కౌసల్య పాత్ర. తర్వాత మనోహరలోని పాత్ర. ఆ రోజుల్లో ఆమెకు ధీటైన నటులు ఎస్వీ రంగారావు, శివాజీ, సావిత్రి. గంభీరమైన స్వరం, చక్కటి రూపం వీటికి తోడు మాటలు పలకడంలో ఆమె చాతుర్యం, హావభావాలతో ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు.
నాటక రంగం నుండి…
కన్నాంబ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో 1912లో జన్మించారు. తండ్రి వెంకట నరసయ్య, తల్లి లోకాంబ. తండ్రి ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేసేవారు. వీరికి కన్నాంబ ఒక్కతే కూతురు. ఈమె తన చిన్నతనంలో ఎక్కువగా అమ్మమ్మ ఇంట్లోనే పెరిగారు. కన్నాంబ సంగీతం మీద ఆసక్తి కనబర చడంతో తాతయ్య ఆమెకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఆనాటి నావెల్‌ నాటక సమాజంలో తన 13వ ఏట బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగప్రవేశం చేశారు. ఆమెకు పదహారేళ్ళ వయసులో ఏలూరులో సత్యహరిశ్చంద్ర నాటకం జరుగుతోంది. ఆ నాటకానికి కన్నాంబ కూడా వెళ్ళారు. చంద్రమతి పాత్రధారిణి శోకరసంలో పాడాల్సిన పద్యాలను పాడకపోవడంతో ప్రేక్షకులు గేలి చేయడం మొదలుపెట్టారు. ప్రేక్షకుల మధ్య నుంచి కన్నాంబ లేచి స్టేజ్‌ మీదకు వెళ్ళి చంద్రమతి పాత్రను తను పోషిస్తానని ప్రకటించి, వేగంగా ముఖానికి రంగు పూసుకొచ్చి పద్యాలు పాడుతూ వుంటే, ప్రేక్షకులు ఆశ్చర్యపోయి చూస్తూ వన్స్‌ మోర్లు కొట్టారంట. అలా కన్నాంబ నటనా ప్రస్థానం మొదలైంది. ఇదే నాటక సమాజం వారు కన్నాంబకు సావిత్రి, సత్యభామ, అనసూయ, చంద్రమతి వంటి మంచి పాత్రలు ఇచ్చి వారి నాటకాలను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఆమె దొన్నేటి సూర్యనారాయణతో కలిసి ‘రంగూన్‌ రౌడి’ అనే నాటకాన్ని దేశ వ్యాప్తంగా ప్రదర్శించి మన్ననలు పొందారు. తన నాటక రంగ అనుభవంతో 1935లో హరిశ్చంద్ర అనే తెలుగు చలనచిత్రంలో చంద్రమతిగా అడుగు పెట్టారు. ఆ తర్వాత ద్రౌపతి వస్త్రాపహరణంలో ద్రౌపది పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకున్నారు.
అతి తక్కువ సమయంలో…
కన్నాంబ సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి, గొప్ప నటీమణిగా కీర్తి గడించారు. నవరసాలను సమర్థవంతంగా పోషించగల అద్భుత నటి. కన్నాంబ భర్త కడారు నాగభూషణం. వీరిద్దరూ కలిసి ‘రాజరాజేశ్వరి’ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. దీని ఆధ్వర్యంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాలు నిర్మించారు. కన్నాంబ అతి తక్కువ సమయంలోనే ఎం.జి.రామచంద్రన్‌, ఎస్‌.ఎస్‌.రాజేంద్రన్‌, శివాజీ గణేషన్‌, నాగయ్య, పి.యు.చిన్నప్ప, నందమూరి తారక రామారావు వంటి అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు. కేవలం కనుబొమ్మలతో ఆవిడ ప్రేమ, కరుణ, రౌద్రం… ఒకటేమిటి నవరసాలు పలికించేవారు.
కన్నాంబ లోలాకులు…
ఆ రోజుల్లో ఆమె నటించిన చిత్రాలలోని పాత్రల పేరుతో కాంచనమాల గాజులు, కన్నాంబ లోలాకులు అంటూ ఆభరణాలు వచ్చేవి. వాస్తవానికి కన్నాంబ గొప్ప ఐశ్వర్యవంతురాలు. కానీ ఐశ్వర్య ఎలా వస్తుందో ఎలా పోతుందో ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటుం టారు. అలా ఆమె ఐశ్వర్యం ఎలా పోయిందో, ఏమైపోయిందో కానీ కన్నాంబ మరణంతో వారు స్థాపించిన కంపెనీలతో సహా అన్నీ మాయమై పోయాయి. ఆమె భర్త నాగభూషణం ఒక చిన్న గదిలో ఉంటూ కాలక్షేపం చేశారు. కన్నాంబ నటించిన చిత్రాలలో ఆత్మబలం, లవకుశ, దక్షయజ్ఞం, జగదేకవీరుని కథ, మాంగల్యబలం, తోటి కోడలు, చరణదాసి, అనార్కలి, పాదుకా పట్టాభిషేకం, అన్నా తమ్ముడు, తల్లి ప్రేమ, సారంగధర వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రతి చిత్రంలోనూ ఆమె నటన అద్భుతమే. సహజ సౌందర్యంతో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
మంచి గాయనిగా…
కేవలం నటిగానే కాదు మంచి గాయనిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు కన్నాంబ పాడిన కృష్ణం- భజరాధా గ్రామఫోన్‌ గీతాలు ప్రతి ఇంటా మారుమోగుతూ ఉండేవి. చండిక చిత్రంలో చేతిలో కత్తి పట్టుకుని, వీరావేశంతో గుర్రం మీద కూచుని ఠీవిగా, కళ్లెర్రజేస్తూ ‘నేనే రాణినైతే, ఏలనే ఈ ధర ఏకధాటిగా’ అనే పాట కోసమే చాలా మంది ఆ రోజుల్లో ఆ సినిమా చూసేవారు. ‘ఏమే ఓ కోకిల..ఏమో పాడేదవు ఎవరె నేర్పినది ఈ ఆట ఈ పాట…’ అంటూ సాగే ఈ పాటలో ఆమె నవ్వులు రువ్వుతు పాడారు. మధ్య మధ్యలో వచ్చే ఆ నవ్వు ఆమె తప్ప ఇంకెవరు అలా నవ్వులు కలుపుతూ పాడలేరని కూడా ఆనాటి ప్రేక్షకులు చెప్పుకునేవారు.
– పాలపర్తి సంధ్యారాణి
కటిక పేదరికంలో…
ఆవిడ గొప్ప మనసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోవాలి. శ్రీ రాజరాజేశ్వరి ప్రొడక్షన్స్‌ ఆనాడు ఒక దాన ధర్మ నిలయంగా విలసిల్లేదని నేటికీ సినీ పరిశ్రమలో ఎంతో మంది చెప్పుకుంటారు. ఇటువంటి గొప్ప నటి కటిక పేదరికంలో చనిపోయారు అని తలచుకుంటే ఎవరికైనా గుండె ద్రవించక మానదు. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న కన్నాంబ 1964 మే 7న తన తుది శ్వాస విడిచారు.

Spread the love