మన భూములపై అదానీ కార్పొరూట్‌

– మచిలీపట్నం పోర్టు దారి కోసం ఖమ్మం జిల్లాలో భూసేకరణ
– ఖనిజ నిక్షేపాలు, సారవంతమైన భూములు లాక్కునే యత్నం
– నాగపూర్‌ – అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు స్పీడప్‌
– మొదటి ప్యాకేజీకి రూ.984 కోట్లు.. కేంద్ర మంత్రి గడ్కరీ ట్వీట్‌
– ప్రజాభిప్రాయ సేకరణలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత
– అలైన్‌మెంట్‌ మార్చాలన్న కలెక్టర్‌.. కుదరదంటున్న ఎన్‌హెచ్‌ అధికారులు
– సీపీఐ (ఎం), రైతుసంఘాల పోరాటం.. నేడు జిల్లాకు ‘జన చైతన్య యాత్ర’
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి (కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి)
తమ దోస్త్‌ అదానీ కోసం మోడీ అండ్‌ కో ఎంతకైనా తెగిస్తుంది.. ఎందాకైనా వెళ్తుందనేందుకు ఖమ్మం జిల్లా మీదుగా వెళ్ళే గ్రీన్‌ ఫీల్డ్‌ (ఎక్స్‌ప్రెస్‌) హైవేనే ఓ నిదర్శనం. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్రలోని నాగపూర్‌ పార్లమెంటరీ స్ధానం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి వరకు నిర్మించే గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు భూములిచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. అయినా మచిలీపట్నం పోర్ట్‌ను హస్తగతం చేసుకున్న కార్పొరేట్‌ దిగ్గజం అదానీ ప్రయోజనం కోసం నిర్మించే ఈ హైవే ఏ ఒక్కచోటా ఇప్పటికే ఉన్న రహదారులను అనుసరించదు. కేవలం పంట చేల మీదుగా నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించి.. తదనుగుణంగా భూ సేకరణ చేసేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం మీదుగా కృష్ణా జిల్లా అమరావతి వరకు ఈ రహదారి నిర్మిస్తున్నారు. దీనివల్ల భూనిక్షేపాలు, సారవంతం, విలువైన భూములు నిర్వాసితులు కోల్పోవాల్సి ఉంటుంది. అటువంటి ఈ రహదారి మాకొద్దంటూ రైతులు ప్రతి ప్రజాభిప్రాయ సేకరణలోనూ చెప్పారు. ఈ రహదారి నిర్మాణం కోసం జిల్లాలో 107 కి.మీల పొడవునా వెయ్యి ఎకరాలకు పైగా సేకరించేందుకు 2019 జూన్‌ నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
పనులు స్పీడప్‌..
నాగ్‌పూర్‌ – విజయవాడ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఖమ్మం – విజయవాడ మధ్య నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ వే పనులు స్పీడప్‌ అవుతున్నాయి. నాలుగు లేన్ల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలో భాగంగా ఖమ్మం కలెక్టరేట్‌ను ఆనుకొని వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి మధ్య మొదటి ప్యాకేజీగా విభజించి త్వరలో పనులు మొదలుపెట్టనున్నారు. 29.92 కిలోమీటర్ల ఈ మొదటి ప్యాకేజీ కోసం తాజాగా రూ.983.90 మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ట్వీట్‌ చేశారు. నేషనల్‌ హైవే 163 (జి)లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే అదానీ, ఇతర కార్పొరేట్‌ కంపెనీల వెహికిల్స్‌ ఖమ్మం నుంచి గంటలోపే విజయవాడ చేరుకోవచ్చనేది ఎత్తుగడ. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ విధానంలో నిర్మించనున్న ఈ రోడ్డు కోసం డిసెంబర్‌లో కేంద్రం టెండర్లను ఆహ్వానించింది. మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌తో పాటు మొత్తం 9 కంపెనీలు ఈ రోడ్డు కోసం టెక్నికల్‌ బిడ్లు దాఖలు చేశాయి. ప్రస్తుతం ఖమ్మం నుంచి విజయవాడకు 130 కిలోమీటర్ల దూరం ఉండగా సుమారు మూడు గంటల ప్రయాణ సమయం పడుతోంది. హైవే నిర్మాణం కంప్లీట్‌ అయితే ప్రయాణ సమయం 60 నుంచి 70 నిమిషాలు మాత్రమే పట్టనుంది. నాగ్‌పూర్‌ – విజయవాడ కారిడార్‌ మొత్తం 405 కిలోమీటర్లు కాగా, తెలంగాణలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, ఖమ్మం జిల్లాల మీదుగా హైవే నిర్మాణం కానుంది. మొత్తం రూ.14,666 కోట్లతో దీన్ని ప్లాన్‌ చేయగా, గ్రీన్‌ ఫీల్డ్‌, బ్రౌన్‌ ఫీల్డ్‌ అప్‌ గ్రేడెడ్‌ సెక్షన్లుగా విభజించారు. 2027లోగా ఈ ప్రాజెక్టును కంప్లీట్‌ చేయడం లక్ష్యంగా ఈ హైవేను చేపట్టినట్టు కేంద్రమంత్రి గడ్కరీ చెబుతున్నారు. ఇదే రోడ్‌ ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం నుంచి వరంగల్‌ హైవే కూడా నిర్మాణం జరుగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య రోడ్డు ప్రయాణ సమయాన్ని, దూరాన్ని తగ్గించడంతో పాటు సరుకు రవాణా, ఏపీలో ఉన్న పోర్టులను తెలంగాణ, మహారాష్ట్రలకు అనుసంధానం కోసం ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఖమ్మం -విజయవాడ మధ్య 1098 ఎకరాలు, ఖమ్మం – వరంగల్‌ మధ్య 1315 ఎకరాలను భూ సేకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
అభ్యంతరాలు తెలిపినా బలవంతంగా…
ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం గోపతి, చింతకాని మండలం నాగిలికొండ, ప్రొద్దుటూరు, బోనకల్‌ మండలం బ్రాహ్మణపల్లి, చిన్నబీరవల్లి, పెద్దబీరవల్లి, మధిర మండలం ఆత్కూర్‌, మాటూరు, నిదానపురం, రొంపిమల్ల, సిరిపురం మీదుగా భూ సేకరణ చేస్తున్నారు. అధికారులు ఎకరానికి రూ.20 లక్షలకు పైగా పరిహారంగా వస్తుందని గ్రామసభల్లో చెబుతుండగా, భూములు కోల్పోతున్న బాధితులు మాత్రం తమకు మార్కెట్‌ రేటును పరిహారంగా ఇవ్వాలని గ్రామసభల్లో డిమాండ్‌ చేస్తున్నారు. కొత్తగా ఈ హైవేల నిర్మాణం కారణంగా గ్రామాల్లో రూ.కోటి వరకు భూముల ధరలు పెరిగాయని, రోడ్డు కోసం భూమి సేకరిస్తే తాము నష్టపోతామంటూ చెబుతున్నారు. ఆఫీసర్లు మాత్రం కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్ట ప్రకారమే పరిహారం నిర్ణయిం చామని చెబుతూ బలవంతంగానైనా భూములు లాక్కునేందుకు పూనుకునే ప్రయత్నంలో ఉన్నారు.
నగర విస్తరణకు అడ్డువస్తుందన్నా…
ఖమ్మం నగర విస్తరణకు అడ్డువస్తుందని, నూతన కలెక్టరేట్‌కూ ఆటంకమని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అభ్యంతరం చెబుతున్నా కేంద్రం మాత్రం భూ సేకరణ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. కనీసం అలైన్‌మెంట్‌ మార్చమన్నా మార్చే పరిస్థితి కూడా లేదంటూ మొండిగా వ్యవహరిస్తోంది. ఇదే విషయమై మంత్రి పువ్వాడ అజరు, సీపీఐ(ఎం), తెలంగాణ రైతుసంఘం అభ్యంతరం చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు.
అదానీ కోసం ఎంతకైనా తెగింపు..
అదానీ కోసం ఎంతకైనా బీజేపీ తెగిస్తుంది. రైతుల బాగోగుల కన్నా అదానీ, కార్పొరేట్ల బాగోగులు వారికి కావాల్సింది. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను అయనకు ధారాదత్తం చేస్తున్న కేంద్రానికి రైతుల భూములు ఓ లెక్కా. ప్రజాభిప్రాయ సేకరణలో రైతుల నుంచి నిరసన వ్యక్తమైనా వారికి పట్టదు.
– పోతినేని సుదర్శన్‌,
తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు

Spread the love