– శ్రీలంక విద్యుత్ ఒప్పందం రద్దు
– లంచం ఆరోపణల దెబ్బ..
న్యూఢిల్లీ: అపార కుబేరుడు, ప్రధానీ మోడీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ అదానీకి శ్రీలంక కొత్త ప్రభుత్వం ఊహించని భారీ షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అదానీ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానయకే సర్కార్ ప్రకటించింది. 2024 డిసెంబరులో గౌతమ్ అదానీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు గాను అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో అదానీ గ్రూప్‌నకు ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. 2024 మేలో వాయువ్య ప్రాంతంలో ఇప్పటికీ నిర్మించని అదానీ పవన విద్యుత్ కేంద్రం నుంచి కిలోవాట్‌కు 0.0826 డాలర్ల చొప్పున విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఇదివరకటి రాజపక్స ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా.. అక్కడి నూతన దిసానయకే ప్రభుత్వం స్థానిక ప్రాజెక్టులపై దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం అదానీ ప్రాజెక్టును సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదానీ ప్రతిపాదన ఖర్చులో దాదాపు మూడింట రెండు వంతుల ధరకే చిన్న పునరుత్పాదన ఇంధన సంస్థలు విద్యుత్తును అందిస్తున్నాయి. దీంతో అదానీ ఒప్పందంపై ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో శ్రీలంకలో అవినీతిని నిర్మూలించి, దేశాన్ని వృద్ధి పథంలో నడిపిస్తాననే హామీతో దిసనాయకే గతేడాది సెప్టెంబర్‌లో అధికారం చేపట్టారు. అదే విధంగా మన్నార్-పూనెరిన్ తీర ప్రాంతాల్లో అదానీ 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కూడా పర్యావరణ సమస్యల కారణంగా సుప్రీంకోర్టులో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ వివాద ప్రాజెక్టు విలువ 442 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,800 కోట్లు)గా ఉంది. ఇది కోర్టులో ఉన్నందున దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. లంచాలు ముట్టజెప్పి విద్యుత్ ఒప్పందాలు చేసుకుందని అదానీ గ్రూపుపై నవంబర్ 19న అమెరికాలో కేసు నమోదయిన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే శ్రీలంక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావంతో శుక్రవారం బీఎస్‌ఈలో అదానీ ఎనర్జీ షేర్ ధర 2.57 శాతం పతనమై రూ.789.95 వద్ద ముగిసింది.