బొగ్గు దిగుమతుల్లో అదానీ నొక్కుడు

Adani is a key player in coal imports– మార్కెట్‌ ధర కంటే రెట్టింపు చెల్లింపు
– ఇంధన ధరలకు ఆజ్యం
– కోట్లాది ప్రజలపై విద్యుత్‌ భారం
న్యూఢిల్లీ : తీవ్ర ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూపు బొగ్గు దిగుమతుల్లోనూ తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తుంది. మార్కెట్‌ కంటే రెట్టింపు ధరలను చెల్లించి దిగుమతి చేసుకుంటున్నట్టు చూపిస్తుందని ఫైనాన్సీయల్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. మధ్యవర్తులను ఉపయోగించి అధిక ధరలకు దిగుమతి చేసుకున్న బొగ్గును భారత విద్యుత్‌ కంపెనీలకు అంటగడుతోంది. దీంతో కరెంట్‌ ఉత్పత్తి వ్యయం ఎక్కువ కావడంతో ఆ భారం వినియోగదారులపై పడుతోంది.
ప్రధాని మోడీ అండతో అదానీ గ్రూపు దేశ ఆర్థిక వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తూ.. మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ ధరలకు బిలియన్‌ డాలర్ల బొగ్గును దిగుమతి చేసుకున్నట్లు కనిపిస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రయివేటు బొగ్గు దిగుమతిదారు అయిన అదానీ ఇంధన ఖర్చులను పెంచి, కోట్లాది వినియోగదారులు, వ్యాపారాలను విద్యుత్‌ కోసం అధికంగా చెల్లించేలా చేస్తోంది.
గత రెండేండ్లుగా తైవాన్‌, దుబారు, సింగపూర్‌లలో విదేశీ మధ్యవర్తులను ఉపయోగించి అదానీ కంపెనీలు 5 బిలియన్ల (దాదాపు రూ.40వేల కోట్లు) విలువైన్‌ బొగ్గును మార్కెట్‌ ధర కంటే రెట్టింపు ధరలకు దిగుమతి చేసుకున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. ఈ కంపెనీలలో ఒకటి తైవాన్‌కు చెందిన వ్యాపారవేత్తకు చెందినది ఉంది. అతను ఇటీవల అదానీ కంపెనీలలో తెరచాటు వాటాదారుగా ఉన్నట్లు రిపోర్ట్‌లు వచ్చాయి. 2019-2021 మధ్య 32 నెలల పాటు అదానీ కంపెనీ ఇండోనేషియా నుండి భారత్‌కు చేసుకున్న 30 సార్ల బొగ్గు రవాణాను ఫైనాన్సీయల్‌ టైమ్స్‌ పరిశీలించింది. అన్ని సందర్బాల్లోనూ దిగుమతి రికార్డులలో ధరలు సంబంధిత ఎగుమతి ప్రకటనల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడయ్యింది. ఆర్థిక నేరాలను నియంత్రించే భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ దర్యాప్తు విభాగం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) ఏడేళ్ల క్రితం చేసిన దర్యాప్తులో కృత్రిమంగా ఇంధన ధరల పెంపు బయటపడింది. బొగ్గు విలువను కృత్రిమంగా పెంచి విదేశాలకు డబ్బు తరలించడం, మరోవైపు దేశీయంగా విద్యుత్‌ కంపెనీలకు అధిక ధరలకు బొగ్గును విక్రయిస్తున్నారని డిఆర్‌ఐ విచారణలో తేలింది. దీనికి సంబంధించి 2016లో 40 మంది దిగుమతిదారులకు డిఆర్‌ఐ నోటీసులు జారీ చేసింది. ఇందులో ఐదు అదానీ కంపెనీలు సహా ఆ గ్రూపునకు సరఫరా చేసిన మరో ఐదు సంస్థలు ఉన్నాయి. రికార్డ్‌ల ప్రకారం.. దిగుమతి ధరలు 50 శాతం నుంచి 100 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయని డిఆర్‌ఐ గుర్తించింది. అధిక ధరలకు దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. విద్యుత్‌ ఛార్జీలు పెంచి.. ప్రజలపై భారం మోపుతున్నారని 2018 నుంచి గుజరాత్‌లోని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. బొగ్గు దిగుమతుల్లో తాము ఎలాంటి తప్పు చేయలేదని అదానీ గ్రూపు పేర్కొంది.

Spread the love