– జాతీయ జెండాలతో ప్రతిపక్షాల వినూత్న నిరసన
– పార్లమెంటు ఆవరణలో బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందజేత
– సభను సజావుగా నడపండి : లోక్‌సభ స్పీకర్‌కు రాహుల్ గాంధీ వినతి
– రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు సమావేశాల్లో అదానీ ముడుపుల వ్యవహారంతోపాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ప్రతిపక్ష సభ్యులకు, బీజేపీకి మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు ‘అదానీ’ అంశంపై చర్చ జరపాలంటూ వినూత్న రీతిలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం పార్లమెంటు ఆవరణలో నిలబడి సభలకు హాజరవుతున్న బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందించారు. ఆ సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్కడకు రావడంతో రాహుల్‌గాంధీ వేగంగా వెళ్లి ఆయన చేతికి త్రివర్ణ పతాకం, గులాబీ అందజేశారు. అయితే రక్షణ మంత్రికి రాహుల్ గాంధీ గులాబీ ఇవ్వడం పట్ల అందరూ ఆసక్తిగా వీక్షించారు. కాగా జాతీయ జెండా, గులాబీలతో నిరసన తెలపడంపై ప్రతిపక్ష నేతలు వివరణ ఇచ్చారు. ఇతర విషయాల కంటే దేశం చాలా ముఖ్యమైనదని బీజేపీ నేతలకు తెలియజెప్పేందుకే వారికి జాతీయ జెండాలు ఇచ్చినట్టు తెలిపారు. ‘అదానీ’ అంశంపై పార్లమెంటులో చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతుండగా, కాంగ్రెస్-సోరోస్ సంబంధాలను బీజేపీ తీసుకొస్తోంది. దీంతో సభా కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగడం లేదు. ఉభయ సభలూ వాయిదాల పర్వం తొక్కాయి.
ప్రతిపక్షాల ఆందోళనల నడుమే రైల్వే సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ప్రతిపక్షాల ఆందోళనల నడుమే లోక్‌సభలో రైల్వే సవరణ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ ఏడాది ఆగస్టు 9న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రైల్వే సవరణ బిల్లును రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు బుధవారం ఆమోదం లభించింది. రైల్వే సవరణ బిల్లు చట్టంగా మారితే రైల్వేల ప్రయివేటీకరణకు దారితీస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో రైల్వేల ప్రయివేటీకరణ జరగదని, రైల్వే బోర్డు పనితీరు మెరుగుపడుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
ఆ వ్యాఖ్యలను తొలగించాలి : రాహుల్ గాంధీ
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కోరారు. బుధవారం పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
”నేను స్పీకర్‌తో సమావేశమయ్యా. నాపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశా. ఆ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సభ సజావుగా జరగాలన్నదే మా లక్ష్యం. చర్చ జరగాలి. బీజేపీ నాయకులు నాకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పనీయండి.
డిసెంబర్ 13న రాజ్యాంగ చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్లు అదానీపై చర్చను కోరుకోవడం లేదు. ఆ విషయాన్ని మేము విడిచిపెట్టం. వాళ్లు మాపై ఆరోపణలు చేసుకోనీయండి, సభ మాత్రం జరగాలి” అని అన్నారు.
‘ద్రోహి’ వ్యాఖ్యలపై ప్రియాంక ఫైర్
రాహుల్ గాంధీని ‘ద్రోహి’ అంటూ సంబిత్ పాత్రా సంబోధించడాన్ని ప్రియాంకా గాంధీ తప్పుపట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలను సైతం ద్రోహులని మాట్లాడిన వ్యక్తులు రాహుల్ గాంధీని విడిచిపెడతారని తాము అనుకోలేమని, వాళ్లకు ఇదేమీ కొత్త కాదని అన్నారు. రాహుల్ గాంధీకి అన్నింటి కంటే దేశమే ఎక్కువని, ఆయనను చూసి తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, ప్రభుత్వమే (పార్లమెంటు కార్యకలాపాలకు) అంతరాయం కలిగించడం నేను మొదటిసారి చూస్తున్నానని తెలిపారు.