అదానీకి బంగ్లా షాక్‌

Adani's bungalow is a shock– విద్యుత్‌ ధరలు తగ్గించాల్సిందేనని పట్టు
– బ్లాక్‌మెయిల్‌ చేస్తే ఊరుకోబోమని స్పష్టీకరణ
ఢాకా: అదానీ గ్రూపుతో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కింద ధరలను గణనీయంగా తగ్గించాలని బంగ్లాదేశ్‌ కోరుతోంది. అదానీ గ్రూప్‌ చైర్మెన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికా న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలైన నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. అమెరికా కోర్టులో ప్రాసిక్యూటర్లు అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌ సంస్థ పెట్టుబడులను నిలిపివేసింది. కెన్యా ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేసుకుంది. వివిధ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా అదానీ గ్రూప్‌ కంపెనీలు 33 బిలియన్‌ డాలర్లకు పైగా నష్టపోయాయి.
షేక్‌ హసీనా ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఏడు ప్రధాన ఇంధన, విద్యుత్‌ ప్రాజెక్టులపై విచారణ జరిపేందుకు దర్యాప్తు సంస్థను నియమించాలని సమీక్షా కమిటీ బంగ్లా ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ ఏడింటిలో అదానీకి సంబంధించిన ప్రాజెక్ట్‌ కూడా ఉంది. మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ సమీక్షా కమిటీని నియమించింది. మరోవైపు…2017లో హసీనా ప్రభుత్వం అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్‌ హైకోర్ట్‌ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
హసీనా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జార్ఖండ్‌లోని గొడ్డా బొగ్గు ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అదానీ పవర్‌ కంపెనీ బంగ్లాదేశ్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టులో ఏవైనా తేడాలు ఉన్నట్లయితే తిరిగి చర్చలు జరుపుతామని బంగ్లాదేశ్‌ విద్యుత్‌, ఇంధన సలహాదారు మహమ్మద్‌ ఫౌజల్‌ కబీర్‌ ఖాన్‌ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు జరిగే విచారణలో అవినీతి, లంచం ఆరోపణలు నిరూపితమైనప్పుడు మాత్రమే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాలను గుర్తించిందని అంటూ విద్యుత్‌ ప్లాంటుకు ఇచ్చిన కొన్ని ఆదాయపన్ను మినహాయింపుల నుండి తమ దేశం ఎలాంటి ప్రయోజనం పొందడం లేదని వివరించారు.
ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ బంగ్లాదేశ్‌ విద్యుత్‌ అభివృద్ధి బోర్డు (బీపీడీ) గత సంవత్సరం అదానీ పవర్‌కు లేఖ రాసింది. కాగా అదానీపై అమెరికా చేసిన అవినీతి ఆరోపణలు తమ ఒప్పందంపై ప్రభావం చూపకపోవచ్చునని కబీర్‌ ఖాన్‌ చెప్పారు. ‘ఎందుకంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. అదానీ మాత్రమే కాదు…విద్యుత్‌ను ఎవరు సరఫరా చేసినప్పటికీ ధరలు సగటు రిటైల్‌ ధరల కంటే తక్కువగా ఉండాలని మేము కోరుకుంటున్నాం’ అని అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్‌కు అదానీ అత్యధిక ధరను (యూనిట్‌ ధర 14.02 టాకాలు) వసూలు చేశారు. ‘అదానీ తన సరఫరాను సగం తగ్గించుకుంటే ఏమీ అవదు. ఎందుకంటే విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సామర్ధ్యం బంగ్లాదేశ్‌కు ఉంది. మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ఏ విద్యుత్‌ ఉత్పత్తిదారునూ అనుమతించం’ అని కబీర్‌ ఖాన్‌ స్పష్టం చేశారు.

Spread the love