బారెడు పొద్దెక్కంగానే చద్ది అన్నంతిని
ఉరుకులు పరుగులతో
అడ్డా చేరుకొంటారు కూలీలు
భాగ్యనగరంలో బస్తీ బస్తీలో
అభాగ్య కూలీలకు అడ్డా ఉంటోంది.
అడ్డా అంటే ప్రత్యేక విడిది కాదు
నీడనిచ్చే షెల్టరు కాదు
మూసి ఉన్న దుకాణాల ముందు
నిలిచి ఉండటమే ఘనమైన అడ్డా
ఉదయం పది గంటలకు
దుకాణదారుడొచ్చి షాపు తీసి కసురుకొంటే…
అడ్డాకూలీలు రోడ్లపై ఎండావానల్లో
నిలిచి పనికోసం ఎదురుచూస్తుంటారు
సూర్యుడు నడినెత్తికొచ్చి మధ్యాహ్నమైన
పనిదొరుకుతోందని పడిగాపులు కాస్తారు
ఆ రోజు పిలుపురాకపోతే ఉసూరుమంటూ
గుడిసె చేరి కాళ్లు ముడుచుకు పడుకొంటారు.
భవన నిర్మాణ పనుల్లో
కర్కానాల్లో సరుకులు దింపే
చోటుకు మైళ్లకొద్ది దూరం
బ్రోకర్ల వెంట వెళ్తుంటారు.
తమకొచ్చే డబ్బులో పని చూపిన
దళారికి వాటా ఇస్తారు
లేదంటే పని దొరకక
పస్తులు పడి ఉంటారు.
చంటిబిడ్డలను గుడిసెల్లో
వదిలి వచ్చిన బాలింతలు, గర్బీణీలు
నిలువనీడలేని… మరుగుదొడ్లులేని
అడ్డాలో పడే వెతలు చెప్పనలవి కాదు.
నిలిచేందుకు జానెడు
చోటుపై హక్కులేకున్నా
ఎనవాబో కూలీలకిచ్చిన జాగీరులా
ధీరుల వీరుల గడ్డలా
కూలీల అడ్డా అని ఎందుకంటున్నారో
అర్థం కావడం లేదు.
ఈ అడ్డాలో కనీస వసతుల కల్పన ఎప్పుడో మరి!
– సంగంబండ జగన్నాధరెడ్డి,
9014539458