అద్దేపల్లి ఫేస్‌బుక్‌ చమక్కులు

ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. ఆ ప్రక్రియల్లో కవిత్వ ప్రక్రియ ఎన్నో తరాల్ని ప్రభావితం చేస్తోంది. ఆ కవిత్వ ప్రక్రియలో ఎన్నో రూపాలు వివిధ సందర్భాల్లో కవులచే సృష్టించబడ్డాయి. ఫేస్‌బుక్‌ చమక్కులు అనే అద్దేపల్లి భరత్‌కుమార్‌ కవిత్వాన్ని చూద్దాం!
ఆధునిక కవిత్వం కాలానుగుణంగా నామరూపాన్ని మార్చుకుంటూ తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంటోంది. లఘుకవితలపై విశేష కృషి చేసిన రావి రంగారావు నాలుగు పాదాల నియతితో ‘కిరణాలు’ అనే కొత్త లఘుకవితా ప్రక్రియను (రూపాన్ని) పరిచయం చేశారు. పాదానికి మూడు పదాలు మించకుండా, నాలుగు పాదాలతో ఎలాంటి అక్షర నియమం లేకుండా రూపొందిన ‘కిరణం’ ప్రక్రియ పాఠకుల్ని అలరిస్తుంది. రావి రంగారావు అన్నట్లుగానే అక్షరాల దృష్టి లేకుండా కవిత్వ శక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టి ‘కిరణాలు’ రాస్తే మంచి కవిత్వం రాయొచ్చు. ఇక ఈ పుస్తకంలో భరత్‌ కుమార్‌ సమకాలీన రాజకీయ, సామాజిక స్థితిగతులపై తన ఆగ్రహాన్ని, ఆలోచనల్ని నిరసనని ప్రతిరోజూ నాలుగు పంక్తుల్లో ఫేస్‌బుక్‌ (ముఖపుస్తకం) ద్వారా అక్షర కిరణాలు ప్రయోగించి వీక్షక పాఠకుల్ని అలరించారు. ఆ కిరణాలే ఈ పుస్తకంగా మన చేతిలోకొచ్చింది. మచ్చుకు కొన్ని కిరణాల్ని ఒడిసి పట్టుకుందాం!!
అధికారం/ అద్దాల గదిలాంటిది/ జనవాకం వినబడదు/ లోపలున్నంత సేపు (పేజీ 11) పై కవిత మన ప్రభుత్వాల తీరుకు పై చమక్కు – వ్యంగ్యంతో చమక్కు అనిపిస్తుంది. వాస్తవం సత్యం చెబుతుంది. అంతా బాగున్నప్పుడు అందరూ బంధువులే/ తేడా వచ్చిందో/ అయినోళ్లు రాబందులే (పేజీ 13). మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్‌ ఏనాడో చెప్పాడు గదా! కుటుంబ బంధాలు ఆర్థికం అయ్యాయి. మహిళలు మనింట్లో కన్నీళ్లు పెడితే అరిష్టం/ టీవీ సిరియళ్లలో ఐతే/ నిర్మాతలకు లాభాలు గరిష్టం (పేజీ.25). మార్కెట్‌ వినిమయ వ్యాపార సంస్కృతికి మానవ విలువలు, మనోభావాలు పట్టవు. లాభార్జనే వారి ధ్యేయం. అన్ని వర్గాలు కరిస్తేనే వారికి రాష్ట్రం వచ్చింది. అన్ని వర్గాలు కనుకనే మనకు హోదా పోయింది (పేజీ 40). ప్రత్యేక హోదా గురించి ఈ పార్టీలు ఏవీ కేంద్రంతో పోరాటం చేయని స్థితి మనకు కరిపించే దృశ్యం. ఖుషీ చేసిన వారికే ఇప్పుడు పురస్కారాలు. తిన్నగా పోయేవారికి తిరస్కారాలు (పేజీ.49) అంటారు. ‘స్మార్టు ఫోనొచ్చాక సులువైంది/ పాలకుల పని/ జనమే చూసేసుకుంటున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని’ (పేజీ48). ఇలా రాజకీయాలు, జీవన సత్యాలు, మానవీయ సంబంధాలు, మంచి చెడులు ఈ చమక్కుల్లో వేడి – వాడి అక్షర కిరణాలుగా పాఠకుల్ని చైతన్య పరుస్తాయి. ఆలోచింపజేస్తాయి
– తంగిరాల చక్రవర్తి, 9393804472 .

Spread the love