ఎనిమిది మెడికల్‌ కాలేజీలకు పాలనా అనుమతులు

–  ప్రభుత్వ జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటులో భాగంగా మరో ఎనిమిది మెడికల్‌ కాలేజీలకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు శనివారం వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలేజీల నిర్మాణానికి రూ.1,447 కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ నిధులతో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా కాలేజీలు, ల్యాబులు, సెమినార్‌ హాళ్లు, అనుబంధ ఆస్పత్రి భవనాలు, హాస్టల్‌ భవనాల నిర్మాణం, ఇతర వసతులను కల్పించనున్నారు. గద్వాల, నర్సంపేట్‌ (వరంగల్‌), యాదాద్రిలో నిర్మించే కాలేజీలకు రూ. 183 కోట్ల చొప్పున, కుత్బుల్లాపూర్‌ (మేడ్చల్‌ -మల్కాజ్‌గిరి)కు రూ.182 కోట్లు, నారాయణ్‌పేట్‌, ములుగు, మెదక్‌లో నిర్మించే కాలేజీలకు రూ.180 కోట్ల చొప్పున, మహేశ్వరంకు రూ.176 కోట్లు కేటాయించింది. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ తెలంగాణ మెడికల్‌ హబ్‌గా అవతరించిందని తెలిపారు.

Spread the love