– ఒక్కొక్కళాశాలలో 172 సీట్లు
– అడ్మిషన్లు పొందేందుకు ఈనెల చివరి వరకు అవకాశం
– జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
చదువుకున్న, చదువుకుంటున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులలో నైపుణ్యాలను పెంపొందింపజేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలలో ఈ సంవత్సరం నుండే అడ్మిషన్లు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో మొత్తం నాలుగు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలకు గాను ఈ సంవత్సరానికి నల్గొండ బాయ్స్(ఐ టి ఐ), అనుముల, డిండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలకు అనుమతి వచ్చిందని, ఈ సంవత్సరం నుండే ఈ కళాశాలల్లో కోర్సులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. జిల్లాలోని యువత ఈనెల 30 లోపు ఆయా కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.అడ్వాన్సుడ్ టెక్నాలజీ కేంద్రాలలో ప్రవేశాల విషయమై శుక్రవారం కలెక్టర్ జిల్లా అధికారులు, సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక్కో కళాశాలలో 172 సీట్లకు గాను 6 కోర్సులు ఉంటాయని, 4 కోర్సులు 1 సంవత్సరానికి సంబంధించి ఉంటాయని, 2 కోర్సులు మాత్రం 2 సంవత్సరాలకు సంబంధించి ఉంటాయని తెలిపారు. ఈ కోర్సులలో ప్రవేశం పొందేందుకు పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలని, అంతకన్నా ఎక్కువ చదివిన వారు సైతం అర్హులని ఆయన పేర్కొన్నారు. రెండు సంవత్సరాలు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లలో చేరి శిక్షణ తీసుకున్న తర్వాత నూరు శాతం జాబ్ గ్యారంటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 25 లోగా జిల్లాలో అనుమతించిన అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో నూటికి నూరు శాతం సీట్లు భర్తీ కావాలని, ఇందుకుగాను ఒక్కొక్కళాశాలకు నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు అయన తెలిపారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలలో కోర్సుల ప్రవేశానికి గాను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. నల్గొండ బాయ్స్ (ఐటిఐ) ఏ టి సి కేంద్రానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను ఇన్చార్జిగా, అనుముల అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు డీఈఓ ను, డిండి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని నోడల్ ఆధికారిగా నియమించినట్లు తెలిపారు.అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలలో అడ్మిషన్లపై స్థానిక కేబుల్ ఛానళ్ళు, స్థానిక మీడియా, అధికారిక మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. అలాగే ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో సైతం విద్యార్థులకు తెలియజేయాలని, విద్యార్థులు ఈనెల 25 నాటికి ఎస్ఎస్ సి, కులము, ఇతర దృవపత్రాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల్లోని కోర్సులలో అడ్మిషన్లు పొందాలని చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రం పనులను వేగవంతం చేయాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. అన్ని ఏటీసీలలో పూర్తిస్థాయిలో సీట్ల భర్తీకి అధికారులందరూ టీం వర్క్ చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికి ప్రతి కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య 100 దాటాలని, ఈ నేల 25 వరకు 172 సీట్లు భర్తీ కావాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దసృ నాయక్ తదితరులు మాట్లాడారు.