– డిగ్రీ ప్రవేశాల్లో 53 శాతం వారే
– అబ్బాయిల కన్నా 7.24 శాతం అధికం
– కామర్స్‌కే జై కొడుతున్న విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసించే వారిలో అమ్మాయిలే ముందంజలో ఉన్నారు. అబ్బాయిల కన్నా ఎక్కువగా వారే చదువుతున్నారు. అవనిలో సగం, ఆకాశంలో సగం మహిళలు అన్న నానుడి ఉన్నది. కానీ ఉన్నత విద్యలో సగానికి కంటే ఎక్కువ మంది అమ్మాయిలు చదువుతుండడం గమనార్హం. రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)కు సంబంధించి వివిధ విడతల్లో భర్తీ ప్రక్రియ సాగింది. ఇప్పటి వరకు 1,055 డిగ్రీ కాలేజీల్లో 4,57,704 సీట్లుంటే, 1,96,442 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో అమ్మాయిలు 1,05,329 (53.62 శాతం) మంది ప్రవేశం పొందారు. 91,113 (46.38 శాతం) మంది అబ్బాయిలు చేరారు. ఈ గణాంకాలను బట్టి డిగ్రీ కోర్సుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు 7.24 శాతం అధికంగా ప్రవేశాలు పొందడం గమనార్హం. వైఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సులతోపాటు ఉన్నత విద్యలో ప్రవేశాలు పెరిగాయి. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్య చదివేందుకు అది దోహదపడింది. గత ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని వల్ల బాల్య వివాహాలు తగ్గడంతోపాటు ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య ఏటా పెరుగుతున్నది. ప్రస్తుతం ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) జాతీయ సగటు 28.4 శాతం ఉంటే, తెలంగాణలో 40 శాతం నమోదైంది. అమ్మాయిల జీఈఆర్ జాతీయ సగటు 28.5 శాతం, తెలంగాణలో 41.8 శాతం ఉన్నది. ఈ గణాంకాలను బట్టి దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్నత విద్యలో అమ్మాయిలే అధికంగా చదువుతున్నారని తెలుస్తున్నది.
డిగ్రీలో బీకాం కోర్సుకే డిమాండ్
దోస్త్ ద్వారా ఏటా డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) కోర్సుకు, డిగ్రీలో బీకాం కోర్సుకు భారీగా డిమాండ్ ఉన్నది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీలో 1,96,442 మంది ప్రవేశాలు పొందారు. అందులో బీకాం కోర్సులోనే 77,469 (39.44 శాతం) మంది విద్యార్థులు చేరారు. ఆ తర్వాత బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులో 36,733 (18.70 శాతం) మంది ప్రవేశం పొందారు. బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులో 32,181 (16.39 శాతం) మంది చేరారు. బీఏలో 28,362 (14.44 శాతం) మంది అడ్మిషన్ పొందారు. బీబీఏలో 15,835 మంది, బీసీఏలో 5,170 మంది, డిప్లొమా కోర్సుల్లో 556 మంది, బీబీఎంలో వంద మంది, బీఎస్‌డబ్ల్యూలో 25 మంది, బీ ఒకేషనల్ కోర్సులో 11 మంది చొప్పున చేరారు.
డిగ్రీ కాలేజీల్లో మిగిలిన సీట్లు 2.61 లక్షలు
రాష్ట్రంలో 1,055 డిగ్రీ కాలేజీల్లో 4,57,704 సీట్లున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1,96,442 (42.92 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,61,262 (57.08 శాతం) సీట్లు మిగిలి ఉన్నాయి. 160 ప్రభుత్వ, విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 89,337 సీట్లుంటే, 55,361 (61.97 శాతం) సీట్లు నిండాయి. ఇంకా 33,976 (38.03 శాతం) సీట్లు మిగిలి ఉన్నాయి. 816 ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో 3,44,793 సీట్లుండగా, 1,32,388 (38.40 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. వాటిలో 2,12,405 (61.60 శాతం) సీట్లు మిగిలాయి. రాష్ట్రంలోని ప్రయివేటు డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. 79 గురుకుల డిగ్రీ కాలేజీల్లో 23,574 సీట్లుండగా, 8,693 (36.88 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. వాటిలో ఇంకా 14,881 (63.12 శాతం) సీట్లు మిగిలాయి. గురుకుల డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు ఖాళీగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.
డిగ్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం : ఆర్ లింబాద్రి
డిగ్రీ విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చామని ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)లో భాగంగా తాము కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని అన్నారు. పరిశ్రమలతో అనుసంధానం చేసుకుని ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను కూడా ప్రవేశ పెట్టామని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు డిగ్రీ విద్యార్థులకూ బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టామని వివరించారు. బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ (ఆనర్స్) నాలుగేండ్ల కోర్సును ప్రవేశపెట్టామని చెప్పారు. అందుకోసం డిగ్రీ కాలేజీలు, ఆస్పత్రులు, బయో ఫార్మాసూటికల్ సంస్థలతో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. ఇలా డిగ్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.