గోలి శ్యామల… కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఈ 52 ఏండ్ల మహిళ ఇటీవలె అరుదైన ఘనతను సాధించారు. వైజాగ్ నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు ఆమె సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న వైజాగ్ ఆర్.కె బీచ్ నుండి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్యామలకు సముద్రాలు ఈదడం హాబీ. ఈ ఐదు రోజుల పాటు ఆమె భద్రత, విజయాన్ని నిర్థారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్‌లు, స్కూబా డైవర్లు, కయాకర్‌లతో సహా 12 మంది సభ్యులు, రెండు పెద్ద పడవలు, ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి. అంతకు ముందు తమిళనాడు-శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామల నిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్‌లో 19 గంటల్లో అధిగమించారు. లక్ష ద్వీపనలో కీల్టన్ ఐలండ్-కడ్మట్ ఐలండ్, హుగ్లీ,గంగ, భాగీరథీ నదుల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది.
శ్యామల కేవలం స్విమ్మర్ మాత్రమే కాదు సృజనాత్మక కలిగిన దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్ కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్‌లోకి ఎంట్రా ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వారట్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రలజను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది.
స్విమ్మింగ్ విజయాలు
పాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.
కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 13డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య స్విమ్మింగ్ చేశారు.
లక్షద్వీప్: లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.
స్విమ్మింగ్ చేసిన నదులు
కృష్ణానది – 1.5 కి.మీ
హుగ్లీ నది – 14 కి.మీ
గంగానది – 13 కి.మీ
భాగీరథి నది – 81 కి.మీ