సౌందర్య కోమ‌లం

ఫైనల్‌ ఇయర్‌ పరీక్ష రాసి ఇంట్లోకి అడుగు పెట్టింది కోమల. తల్లి ఎదురుగా వచ్చి ”నువ్వు అదృష్ట వంతురాలివి, మంచి సంబంధం వచ్చింది. వాళ్ళకు నువ్వు నచ్చావంట’ అని సంబరంగ చెప్పింది. ”అమ్మా నీకు తెలుసు కదా నాకు డాన్స్‌, యాక్టింగ్‌ అంటే ఇష్టమని”. ”తెలుసు, కానీ పెండ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం జీవితంలో! అందులో మంచి సంబంధం” అన్నాడు తండ్రి. అలా కోమల పెండ్లి జరిగిపోయింది. కన్నవారిని, పుట్టిన దేశాన్ని విడిచి ఇరాన్‌ వెళ్ళిపోయింది. అయితే కార్యదీక్ష ఉన్నవారు ఎక్కడయినా ఊరికే కుర్చోరు కదా! అక్కడ ఉన్న ఆరేండ్ల కాలంలో ఆసక్తి, అభిరుచితో సరదాగా కొన్ని సౌందర్య చికిత్స కోర్సులను నేర్చుకుంది. అదే తర్వాత తన జీవితానికి ఆలంబన అవుతుందని అస్సలు ఊహించలేదు. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
జీవితంలో జరిగిన కొన్ని విషాద సంఘట నల వల్ల పిల్లలని తీసుకుని తిరిగి స్వదేశానికి వచ్చేశారు. రోమ్‌ ఒక్క రోజులోనే కట్ట లేదు అన్నట్లుగా కోమల తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరికి లక్ష్యాన్ని చేరుకున్నారు. అయితే జీవితంలో కొన్ని చేదు అనుభవాలని చూసాక ఒక నిర్వేదమైన పరిస్థితి. అలాంటి సమయంలో ఒక రోజు కోమలను కలవడానికి వచ్చిన స్నేహితురాలు ఆమెని చూసి ఆశ్చర్య పోయింది. ”ఏంటి కోమలా ఇలా అయిపోయావు. ఎంత హుషారుగా ఉండే దానివి, అయినా ఇలా ఒంటరిగా కూర్చుంటే ఎలా..? ఏదో ఒక పనిలో మమేకమవ్వాలి” అంటూ బ్యూటీ కోర్స్‌ చేయడానికి పునాది వేసింది. అలా తన స్నేహితురాలి సహయంతో బ్యూటీ కోర్స్‌ చేసి ముప్ఫై ఏండ్లుగా ఆ రంగంలోనే స్థిరపడింది. ముఖ్యంగా ఎలక్ట్రోలిసిస్‌్‌, హెయిర్‌ కేర్‌ మీద దృష్టి సారించి దానిలో పట్టు కోసం పన్నెండు కోర్సులు చేశారు.
సొంత ఉత్పత్తులతో…
తన దగ్గర వచ్చే క్లయింట్ల సమస్యలకు పరి ష్కారం కనుక్కోవాలని తనదైన సొంత హెర్బల్‌ కేర్‌ ప్రోడక్ట్‌కి శ్రీకారం చుట్టింది. అయితే తను నడిచింది పూలబాట కాదు. మొదట్లో చాలా అవరోధాలు ఎదు ర్కుంది. చిన్నతనం నుంచి తన కెంతో ఇష్టమయిన నాట్యాన్ని, నట నను దూరం పెట్టారు. నేర్చు కున్న సౌందర్య పోషణలో మెళుకువ లను శాస్త్రీయంగా అభ్యసిం చారు. ”ఆరోగ్యానికీ, అందానికి విడదీయరాని బంధం ఉంది. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మన శరీరం కూడా అంతే అందంగా మెరుస్తూ కనిపి స్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ స్త్రీ అందంగా కనిపించాలనే ఆరాట పడుతుంది. అది సహజ స్వభావం. చాలా మంది చూడటానికి చాలా సామాన్యంగా ఉంటారు. అలాంటి వారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించి మెరుగులు దిద్దికుంటే వారి అందం మరింత అనుమడిస్తుంది. అలాంటి వారి కోసమే హెయిర్‌ కేర్‌ బ్రాండ్‌ వెనికా హెర్బల్స్‌ స్థాపించి జుట్టు, చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందిస్తున్నాను” అన్నారు కోమల.
ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది
కలలు అందరూ కంటారు. అయితే అవి సాకారం చేసుకోవడానికి పట్టుదల, కృషి చాలా ముఖ్యం. ”మీరు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు” అంటూ చాలా మంది అడుగుతుంటారు. వారందరికీ ఆమె చెప్పే సమాధానం ఒక్కటే ”ఇది నాకు అత్యంత ఇష్టమైన పని. ఇది నా కల” అంటారు. అలాగే ”వ్యాపారంలో చాలా సవాళ్లు ఉంటాయి, డీలా పడిపోకూడదు. నా సంస్థ ఎప్పుడూ మంచి ఆదాయాన్ని ఇచ్చేదే. ఎంతో మందికి జీవితాన్ని ఇస్తుంది. నాకున్న లక్ష్యం ముందు మిగతా సమస్యలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి” అంటున్నారు ఆమె. ఆమెకు తన కుటుంబం చాలా మద్దత్తుగా నిలబడింది. అలాగే భర్త, పిల్లలు కూడా ఎంతో ప్రోత్సహిస్తూ తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపారంటున్నారు.
రెండు బ్రాంచ్‌లు…
తొలి నాళ్లలో హైదరాబాద్‌లో ఒక పర్షియన్‌ కాస్మోటాలజిస్ట్‌ను దగ్గర విద్యుద్విశ్లేషణ, ఊబకాయం చికిత్సలు, అధునాతన జుట్టు, చర్మ చికిత్సలో కోర్సులను నేర్చుకుంది. అప్పుడు సొంతంగా ఖూబ్‌ సూరత్‌ అనే బ్యూటీ పార్లర్‌ని పెట్టి సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వచ్చింది. తన సొంత అవుట్‌లెట్‌తో ప్రయోగాలు చేస్తూ ”ఖూబ్‌ సూరత్‌ ఒబేసిటీ ఎలక్ట్రోలిసిస్‌ బ్యూటీ క్లినిక్‌” రెండో బ్రాంచ్‌ని కూడా ప్రారంభించారు. కోమల ఇద్దరు కొడుకులు ప్రస్తుతం మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కెనడాలో ఉంటున్న తన పెద్ద కొడుకు వద్దకు అనేక సార్లు వెళ్లారు. దాంతో విదేశీ పార్లర్లలో ఉండే మెళకువలు, ఉత్పత్తుల గురించి తెలుసుకున్నారు. ఆయుర్వేదంతో పాటు వివిధ నైపుణ్యా లలో శిక్షణ పొందిన ఆమె అనుభవం, పరిష్కారాలు క్లయింట్లకు బాగా నచ్చాయి.
మహళలకే ప్రాధాన్యం
అంతటితో ఆగక ఇంకా ఏదో సాధించాలనే తపనతో ల్యాండ్‌మార్క్‌ ఫోరమ్‌ వారి వ్యక్తిగత అభివృద్ధి కోర్సు ఆమెను వ్యాపారాన్ని ప్రారంభించేలా ప్రేరేపించింది. 2015లో వెనికా హెర్బల్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించు కున్నారు. ఇందులో వీలైనంత ఎక్కువ మంది మహిళలను నియమించు కోవాలని భావించారు. తద్వారా కొంత మందికైనా ఉపాధి కల్పించవచ్చని ఆమె కోరిక. అలా రూ. 1 లక్ష ప్రారంభ పెట్టుబడితో దాదాపు 11 రకాల ఆయుర్వేద ఉత్పత్తులను అభివృద్ధి చేసి మార్కెట్‌ చేశారు. అంతే కాదు ఇప్పుడు D2C బ్రాండ్‌గా వెనికా హెర్బల్స్‌ తన వెబ్‌సైట్‌, అమెజాన్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హెయిర్‌ ఆయిల్‌, హెయిర్‌ ప్యాక్‌, హెన్నా, ప్యూర్‌ షికాకారు, ప్యూర్‌ రీతా, హెయిర్‌ షాంపూ, ఫేస్‌ వాష్‌, ఫేస్‌ ప్యాక్‌ వంటి FSSAI సర్టిఫైడ్‌ ఉత్పత్తులను చేస్తున్నారు. ప్రస్తుతం రూ.15 లక్షల వార్షిక విక్రయాలు జరుగుతుండగా కోమల బ్యాంకు నుంచి దాదాపు రూ.7 లక్షల వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్‌ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె వద్ద 10 నుంచి 12 మంది వరకు ఉపాధి పొందుతున్నారు.
పసుపు నిలబెట్టింది
కోవిడ్‌ -19 మహమ్మారి అందరికీ కష్టతరమైన కాలంగా మారింది. అయినప్పటికీ రోగనిరోధక శక్తిని పెంచే ఆర్గానిక్‌ పసుపు అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులలో అగ్రశ్రేణిగా నిలిచింది. ఇదే ఆమె వ్యాపారం నిలకడగా ఉండటానికి సహాయపడింది. సేల్స్‌ ఛానెల్‌ని విస్తరించడం, మరిన్ని మార్కెట్‌ ప్లేస్‌లలో లిస్టింగ్‌ చేయడం ద్వారా ఔత్సాహిక మహిళ వ్యాపారవేత్తగా 22-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల వార్షిక టర్నోవర్‌ను ఆశించారు. జర్మన్‌ ఫెడరల్‌ మినిస్ట్రీ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (BMZ) తరపున మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడానికి, నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (MSDE) భాగస్వామ్యంతో ప్రభుత్వం ఆమెకు మద్దతు ఇచ్చింది. విశిష్ట మహిళగా ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. వాటిలో అతి ముఖ్యమైనవి సావిత్రీ బాయిపూలే అవార్డు, వి హబ్‌ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తమ ఉత్పత్తిదారి అవార్డు, అబ్దుల్‌ కలాం అవార్డును అందుకున్నారు కోమలా దేవి. తన విజయానికి కారణం పాజిటివ్‌ థింకింగ్‌ అంటున్నారు.
కష్టాలకు కుంగిపోకుండా
”జీవితంలో ఏదో చేయాలి, అనే తపన ఉన్న అందరూ తమకంటూ ఒక అభిరుచిని పెంపొందించుకోవాలి. ఎప్పుడూ నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఆత్మ నిబ్బరంతో, ధైర్యంగా కష్టనష్టాలకు ఓర్చుకుంటూ ముందుకు సాగాలి” అంటారు ఆమె. అలాగే తనవంతు సాయంగా సమాజానికి తాను చేయగలగిన సహాయాన్ని అందిస్తానని చెప్పడంతో కోమలలో మానవత్వం స్పష్టంగా కనిపిస్తుంది. కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి పట్టుదలతో శ్రమించే విజయం మనదే అని కోమల నిరూపించారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

– మణి వడ్లమాని, 9652067891

Spread the love