కోహ్లీతో వివాదంపై ఆఫ్ఘన్ బౌలర్ స్పందన

నవతెలంగాణ – హైదరాబాద్
ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో విరాట్ కోహ్లీకి, ఆఫ్ఘనిస్థాన్ యువ బౌలర్ నవీనుల్ హక్ కు మధ్య జరిగిన వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన తర్వాత నవీనుల్ హక్ ను సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానులు భారీగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దాంతో నవీనుల్ హక్ కూడా వీలు చిక్కినప్పుడల్లా కోహ్లీని పరోక్షంగా విమర్శించడం మొదలుపెట్టాడు! ఈ వివాదంపై నవీనుల్ హక్ ఓ మీడియా సంస్థకు వివరణ ఇచ్చాడు. ఆ గొడవను తాను ప్రారంభించలేదని స్పష్టం చేశాడు. కోహ్లీనే మొదట గొడవపడ్డాడని, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ తనపై తిట్ల వర్షం కురిపించాడని వివరించాడు. కోహ్లీ అన్నేసి మాటలు అంటుంటే తాను కేవలం ప్రతిఘటించానని నవీనుల్ హక్ వెల్లడించాడు. ఐపీఎల్ నిర్వాహకులు తామిద్దరికీ విధించిన జరిమానాలను గమనిస్తే తప్పు ఎవరిదో అర్థమవుతుందని పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో కోహ్లీ తన చేతిని బలంగా ఊపేశాడని, తాను కూడా మనిషినే కాబట్టి అదే స్థాయిలో స్పందించాల్సి వచ్చిందని నవీనుల్ హక్ వివరణ ఇచ్చాడు. కాగా, ఆ మ్యాచ్ లో ప్రవర్తనకు గాను కోహ్లీ పూర్తి మ్యాచ్ ఫీజు కోత విధించగా, నవీనుల్ హక్ కు సగం ఫీజు కోతగా విధించడం తెలిసిందే.

Spread the love