అఫ్గానిస్థాన్‌లో బాంబు పేలుడు..

నవతెలంగాణ – అఫ్గానిస్థాన్‌: అఫ్గానిస్థాన్‌లో బదాక్షన్‌ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ నాసిర్‌ అహ్మద్‌ అహ్మది కారుబాంబు పేలుడులో మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని ప్రావిన్షియల్‌ అధికారిక ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటనపై ప్రావిన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీస్‌ అధిపతి ముజాహిద్దీన్‌ అహ్మది మాట్లాడుతూ.. ‘‘కారు బాంబు పేలుడులో నాసిర్‌ అహ్మద్‌ అహ్మది, ఆయన డ్రైవర్‌ సహా మరణించగా.. మరో ఆరుగురు పౌరులు ఈ దాడిలో గాయపడ్డారు’’ అని తెలిపారు. ఈ బాంబుపేలుడు వెనుక ఎవరున్నారన్న విషయం మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. చాలా వారాల తర్వాత తాలిబన్‌ పాలనలో చోటు చేసుకొన్న అతిపెద్ద పేలుడు ఇదే. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారులో పేలుడు పదార్థాలను నింపుకొని అహ్మది ప్రయాణిస్తున్న వాహనం సమీపంలోకి దూసుకొచ్చి పేల్చేసుకొన్నాడు. ఈ ప్రావిన్స్‌లో సాంస్కృతిక, సమాచార విభాగానికి అహ్మది అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఐసిస్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్‌ ప్రభుత్వం ఇప్పటికే దాడులు మొదలుపెట్టింది. మరోవైపు ఐసిస్‌ ఉగ్రవాదులు పలు నగరాల్లో తీవ్రమైన దాడులు చేశారు. మార్చిలో బల్ఖ ప్రావిన్స్‌ గవర్నర్‌ను చంపినట్లు ఇప్పటికే ప్రకటించుకొంది. గత డిసెంబర్‌లో ఇదే ప్రావిన్స్‌లో పోలీస్‌ చీఫ్‌ను కూడా ఇటువంటి దాడిలోనే ఐసిస్‌ ఉగ్రసంస్థ హత్య చేసింది. అంతేకాదు 2022 ఏప్రిల్‌లో అఫ్గానిస్థాన్‌ గనుల శాఖ అధిపతిని కూడా బాంబుపేలుడులో హత్య చేసింది.

Spread the love