– పెళ్లి సంబంధం మాట్లాడదామని పిలిచి, చంపి వరిచేల్లో పాతిపెట్టారు
– కేసును చేధించిన సైబరాబాద్ పోలీసులు
– నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
– వివరాలను వెల్లడించిన శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్
మాయ మాటలు చెప్పి ఒక వ్యక్తిని మట్టిలో కలిపిన ఘటన కేశంపేట మండల పరిదిలోని నిర్దవెళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. పక్క ప్లాన్ ప్రకారం కాళ్లతో తొక్కి పట్టి వరిచేను నీటి బురదలో తలను ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసి చివరికి అదే బురదలో పాతిపెట్టిన కేసును పోలీసులు చేదించారు. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం షాద్‌నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. కేశంపేట మండలంలో గత నెల 29 వ తేదీన కరుణ కుమార్ అదృశ్యం అయ్యాడని తన అన్న దీపక్ కుమార్ పోలీసులకు ఫీర్యాదు చేశాడు. కరుణ కుమార్ కేశంపేట మండల పరిధిలో పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. కరుణ కుమార్ కనిపించడం లేదని కేసు నమోదు అవ్వడంతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడికి తెలిసిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేయాలని గత నెల 15 వతేదీన నిర్దవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే దారిలోకి రావాలని అక్కడి వస్తే పెళ్లి చేస్తాం రమ్మని వరిచేను దగ్గరికి రమ్మని పిలిపించుకున్నారు. అక్కడి వచ్చాక కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురదలో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అయితే రంజిత్ కుమార్ కూతురు విషయంలో కరుణ కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తన కూతురు నుదుటిపై సింధూరం లాంటి బొట్టు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తమ పరువు ఎక్కడ పోతుందోనని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులపై 302, 201 ,34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రీమాండ్‌కు తరలించారు. ఈ హత్య కేసులో రంజిత్‌తో పాటు సంతోష్ కుమార్, దబ్లు కుమార్ అనే వ్యక్తులను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మొత్తం ఐదుగురు నిందితులు ఉండగా ఇద్దరు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హౌమ్ కు తరలించినట్టు తెలిపారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి, షాద్‌నగర్ రూరల్ సీఐ లక్ష్మ రెడ్డి, కేశంపెట్ మండల ఎస్సై వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.