– గత ప్రభుత్వాలు మత్స్యకారులను గుర్తించలేదు : పశుసంవర్ధన శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ముప్పై ఏండ్లుగా జరగని అభివృద్ధి ఐదేండ్లలో జరిగి అద్భుతమైంది.. ఈ ప్రగతిని చూసి నల్లగొండ ప్రజలే రాబోయే ఎన్నికల్లో సమాధానం చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ ఏర్పాటు కాకముందు ఏ ప్రభుత్వమూ మత్స్యకారుల ను గుర్తించలేదన్నారు. వారికి ఆదాయం కల్పించా లన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. చేప పిల్లల పంపిణీతో నేడు లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. మత్స్యకారులను ఆర్థికం గా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసు కెళ్లడానికి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. పాల రైతులను ప్రోత్సహి స్తున్నామని, విజయ డెయిరీతో అనేకమందికి స్వయం ఉపాధి లభిస్తుందన్నారు. త్వరలోనే నాలుగు రూపాయల ఇన్సెంటివ్ కూడా అందజేయనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేది సంక్షేమమే అని, సేవ చేస్తారనే భావనతోనే మంచి నాయకున్ని ఎన్నుకుంటారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సార్థకత తీసుకొచ్చారని చెప్పారు.
ప్రధాన పట్టణాలలో ఐటి హబ్ ఏర్పాటు జరుగుతుందని అందులో భాగంగానే 75 కోట్ల రూపాయలతో నల్లగొండలో కూడా ఐటీ హబ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం తన శాఖ నుంచి ఏది కావాలన్నా చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పశుసంపద ఎక్కువగా ఉన్నందున గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరగా.. తన శాఖ నుంచి ఏదీ కావాలన్నా చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్, డెయిరీ కార్పొరేషన్ చైర్మెన్ సామా భరత్, గొర్రెల మేకల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మెన్ బాలరాజు యాదవ్, జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తా, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ పంకజ్‌యాదవ్, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య పాల్గొన్నారు.