మరోసారి చైనాపై

విరుచుకుపడనున్న బైడెన్‌-మీడియా
చైనా డెఫెన్స్‌ పరిశ్రమలో అమెరికా పెట్టుబడులను నియంత్రించ టానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఒక ఎక్సిక్యూటివ్‌ ఆర్డర్‌ను తయారు చేస్తున్నట్టు ఒక అజ్ఞాత వనరు అందించిన సమాచారం ఆధారంగా ఆక్సి యోస్‌ వార్తా సంస్థ రిపోర్ట్‌ చేసింది. అమెరికా తీసుకుంటున్న ఇటువంటి చర్యలను చైనా ”ఆర్థిక బలాత్కారం”గా పేర్కొంటోంది. ఈ ఎక్సిక్యూటివ్‌ ఆర్డర్‌ మరి కొన్ని రోజుల్లో విడుదల అవుతుందని ఆక్సియోస్‌ రాసింది.
ఈ ఆర్డర్‌ ఎప్పుడో రావలసిందని, జి-7 దేశాలన్నింటితో ఇటువంటి విధానాన్ని అవలంబించేలా చేయాలనే ఉద్దేశం ఉండటంవల్ల ఇది ఆలస్యం అయినదని అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో జపాన్‌ లోని హిరోషిమాలో జరిగిన జి-7 సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. చైనా ”డిఫెన్స్‌ పరిశ్రమ”ను ఎంత విస్తృతంగా నిర్వచిస్తారనే విషయంపట్ల ఇంకా స్పష్టత రాలేదు.
చైనా మిలిటరీ-ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ దాదాపు ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంది. దీనిపై ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆంక్షలు విధించాడు. ఇది కాకుండా వివిధ టెక్నాలజీలు రక్షణ రంగాన్ని ప్రభావితం చేస్తాయనే పేరుతో ”సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగాల”పై ఆంక్షలు విధించే అవకాశముందని బ్లూమ్‌ బర్గ్‌ గత నెలలో రిపోర్ట్‌ చేసింది.
ఇప్పటికే అక్టోబర్‌ నెలలో చైనాకు సెమీకండక్టర్ల, సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే హార్డ్‌ వేర్‌, సాఫ్ట్‌వేర్‌ల ఎగుమతులపైన అమెరికా ఆంక్షలను విధించింది. అంతేకాకుండా చైనాను సెమీకండక్టర్‌ సప్లై చైన్ల నుంచి మినహాయించేందుకు ”చిప్‌ 4 ఎలియన్స్‌” పేరుతో జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌ దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది. ఈ చర్యలను జాతీయ భద్రతకు సంబంధించిన విషయంగా అమెరికా సమర్థించుకుంటోంది. అయితే ఈ చర్యల ”వాస్తవ లక్ష్యం చైనా తనను తాను అభివృద్ధి చేసుకునే హక్కును లేకుండా చేయటమేనని, ఇది ఆర్థిక బలాత్కారం తప్ప మరొకటి కాదు” అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌ బిన్‌ ప్రకటించాడు.

Spread the love