లండన్‌లో నిరసనల హోరు
లండన్: శిలాజ ఇంధన దిగ్గజం ‘షెల్’ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని బ్రిటన్‌లో పెద్దయెత్తున నిరసనలకు దిగారు. బ్రిటన్‌లో ఒకవైపు లక్షలాది మంది పేదరికం, వాతావరణ సంక్షోభంతో నానా అవస్థలు పడుతుంటే, మరో వైపు షెల్ కంపెనీ రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జిస్తోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాజ రహిత ఇంధనం, ఎక్స్‌టెన్షన్ రెబిలియన్ (ఎక్స్‌ఆర్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో ‘ షెల్ హెల్‌కు వెళ్లు, తిరిగి రావద్దు’ అంటూ నినదించారు. నిరసనకారుల ఆందోళనతో తూర్పు లండన్‌లో షెల్ వార్షిక సమావేశం దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇల్లును గుల్ల చేయడమే గాక ప్రజల ఉపాధిని, జీవితాలను నాశనం చేసే షెల్‌ను మూసివేయాలి అని ఓ నిరసనకారుడు సమావేశ మందిరంలోకి వెళ్లి నినదించాడు. షెల్ కంపెనీ చైర్మన్ సర్ ఆండ్రూ మెకంజీ ఆ నిరసనకారుడిని ఉద్దేశించి మీ డిమాండ్ విన్నాం . ఇక మీరు వెళ్ళొచ్చు అని అన్నారు. సమావేశ స్థలికి వెలుపల షెల్‌కు వ్యతిరేకంగా బ్యానర్లు పట్టుకుని, పాటలు పాడుతూ, నృత్య రూపకాలను ప్రదర్శించారు. షెల్ కంపెనీ పుణ్యమాని తాము నరకానికి చేరువవుతున్నామని అన్నారు. ఇంతలోనే భద్రతాదళాలు వచ్చి నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్సవాయువును ప్రయోగించారు. కొంత మందిని బలవంతంగా లాక్కెళ్లి పోలీసుల వాహనమెక్కించారు. పీపుల్స్ హెల్త్ ట్రిబ్యునల్‌కు చెందిన ఒక కార్యకర్త మాట్లాడుతూ, ‘షెల్ అనేది ప్రపంచ వ్యాపితంగా మానవ హక్కులను, పర్యావరణ చట్టాలను కాలరాసే సంస్థ అని విమర్శించారు. షెల్ ఆఫ్రికా అంతటా ప్రజల ఆరోగ్యాన్ని, జీవనోపాధిని, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేసిందని ఎంఎస్ ఒస్బోర్న్ అనే మరో కార్యకర్త అన్నారు.