ఏజెన్సీ డీఎస్సీ వేయాలి

– ఖాళీగా ఉన్న ఐటీడీఏ, గిరిజన ఉద్యోగాలను భర్తీ చేయాలి : టీఏజీఎస్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌
రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటానికి ప్రత్యేకంగా ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజీఎస్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆన్‌లైన్‌లో రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు అధ్యక్షతన జరిగింది. సమావేశం పలు తీర్మానాలు ఆమోదించింది. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ మిడియం బాబురావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ మాట్లాడుతూ.. ఖరీప్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో భద్రాచలం, ములుగు, ఉట్నూర్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల కంపెనీ ప్రతినిధులు గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ అమాయక ఆదివాసులకు మాయ మాటలు చెప్పి నకిలీ విత్తనాలను అమ్ముతున్నారని, వాటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీల అమాయకత్వం ఆసరా చేసుకొని దళారులు వడ్డీ వ్యాపారంతో గిరిజనులను ఆర్థికంగా నష్టం చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకు అధికారులు వ్యవసాయ రుణాలు ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వారిని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ నెల 24 నుంచి పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించింది కానీ అర్హుల జాభితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించకుండా రహస్యంగా ఉంచుతోందన్నారు. దాంతో ఆదివాసుల భూములకు హక్కు పత్రాలు వస్తాయో రావోనని ఆందోళనలో ఉన్నారన్నారు. వెంటనే అర్హుల జాబితాను గ్రామ, మండల, జిల్లా వారీగా ప్రకటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి హక్కు పత్రం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారం పుల్లయ్య, బండారు రవి కుమార్‌, పొలం రాజేందర్‌, ఎర్మా పున్నం, సహాయ కార్యదర్శులు బైరి సోమేశ్‌, ఆత్రం తనుష్‌, సున్నం గంగ, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love