వ్యవసాయ సంక్షోభమే ప్రధాన రాజకీయ సమస్య

వ్యవసాయ సంక్షోభమే ప్రధాన రాజకీయ సమస్య– రెండో రోజు మహాపడావ్‌లో లక్షల మంది కార్మికులు, కర్షకులు
– నయా ఉదారవాద విధానాలే సంక్షోభానికి మూలం
–  నేడు రాజ్‌ భవన్‌లకు రైతులు, కార్మికుల మార్చ్‌
న్యూఢిల్లీ : దేశంలో వ్యవసాయ సంక్షోభం జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ సమస్యగా మారిందని మహాపడవ్‌ స్పష్టం చేసింది. కేంద్రంలోని మోడీ సర్కార్‌ కార్మిక, కర్షక, ప్రజా, దేశ వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్ల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో రాజ్‌ భవన్‌ (గవర్నర్‌ కార్యాలయాల)ల ఎదుట రెండో రోజు సోమవారం మహాపడవ్‌ కొనసాగింది. ఇందులో లక్షల మంది కార్మికులు, కర్షకులు పాల్గొన్నారు. వివిధ ప్రజా సంఘాలు సంఘీభావంగా నిలిచాయి. కార్మికులు, రైతు ఐక్యత మోడీ సర్కార్‌ కార్పోరేట్‌, మతపరమైన బంధాన్ని సవాలు చేసింది. డిమాండ్ల చార్టర్‌ను గవర్నర్‌కు సమర్పించేందుకు నేడు (మంగళవారం) రైతులు, కార్మికులు రాజ్‌భవన్‌లకు మార్చ్‌ చేయనున్నారు.
దేశ చరిత్రలో మొదటిసారి
వేలాది మంది రైతులు, కార్మికులు ఆందోళన చేసే దగ్గరే వంటావార్పు చేశారు. మహాపడవ్‌ సైట్‌లో ట్రాక్టర్‌ ట్రాలీలు, తాత్కాలిక టెంట్‌లలో రాత్రి బస చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో కార్మికులు, రైతుల ఐక్యతకు రాజకీయ ప్రాధాన్యతనిస్తూ ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్ర రాజధానుల్లో మహాపడవ్‌ కొనసాగింది. నిర్దిష్ట డిమాండ్‌ చార్టర్‌, కార్యాచరణ ప్రణాళికతో కార్మికులు, రైతుల వేదికల కలయిక స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా జరుగుతోంది.
వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి
కార్మికులు, రైతుల వేదికల అఖిల భారత నాయకులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దీర్ఘకాలిక వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పేద రైతాంగం, గ్రామీణ శ్రామిక ప్రజానీకం, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ వలసలను పరిష్కరించాల్సిన అవసరంపై దృష్టి పెట్టాలన్నారు.
నయా ఉదారవాద విధానాలు వ్యవసాయ సంక్షోభానికి మూలమని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం, సంబంధిత వ్యవసాయ కార్పొరేటీకరణ విధానం అఖిల భారత స్థాయిలో ప్రధాన రాజకీయ సమస్యగా మారాయన్నారు. అందువల్ల, రాబోయే రోజుల్లో ప్రతి కార్మికుడు, రైతు అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి ప్రచారం, పోరాటాలు మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.

Spread the love