బందీల విడుదలకు ఒప్పందం..?

Agreement for the release of hostages..?న్యూయార్క్‌: అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ చేసిన దాడిలో బందీలుగా మారిన అనేకమంది మహిళలు, పిల్లల విడుదలకు ఇజ్రాయిల్‌, హమాస్‌ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టు ఇజ్రాయిల్‌ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పిన విషయాన్ని వాషింగ్టన్‌ పోస్టు ఉటంకించింది. మరికొన్ని రోజుల్లో ఈ ఒప్పందం వివరాలు తెలిసే అవకాశం ఉందని ఆ పత్రిక రాసింది. పాలస్తీనా మహిళలను, యువకులను విడతల వారీగా ఇజ్రాయిల్‌ విడుదల చేసినందుకు ప్రతిగా హమాస్‌ కూడా తమ వద్ద బంధీలుగావున్న ఇజ్రాయిలీ మహిళలను, పిల్లలను విడుదల చేస్తున్నది. ఐదు రోజుల కాల్పుల విరమణ చేస్తే ఇప్పటికే 70మంది ఇజ్రాయిలీ మహిళల ను, పిల్లలను విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నామని హమాస్‌ అల్‌-ఖస్సమ్‌ బ్రిగేడ్స్‌ అధికార ప్రతినిధి అబు ఉబైదా ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయిల్‌ జైళ్ళలో 120మంది మహిళలు, పిల్లలు ఉన్నారని వాషింగ్టన్‌ పోస్టుకు ఒక అరబ్‌ అధికారి చెప్పినట్టు ఆ పత్రిక రాసింది. అయితే ఇజ్రాయిలీ జైళ్ళలోవున్న 200 మంది పిల్లలను, 75మంది మహిళలను విడుదల చేయాలని హమస్‌ కోరుతున్నట్టు ఉబైదా చెప్పాడు.
ఈ ఒప్పందం కుదిరితే బందీల విడుదలే కాకుండా తాత్కాలిక కాల్పుల విరమణ కూడా జరిగే అవకాశాలున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అనేక వారాలుగా ఇజ్రాయిలీ సైనిక దళాల ముట్టడిలోవున్న గాజాకు అంతర్జాతీయ సహాయాన్ని అనుమతించే అవకాశం ఉంది. విడుదలవుతున్నవారి నేపధ్యాన్ని పరిశీలించవలసిన అవసరం ఉందని ఇజ్రాయిల్‌ పట్టుబడుతోంది. హమస్‌ చెరలో బంధీలుగా వున్నవారి సంఖ్య గణనీయమైనప్పటికీ ఇతర గ్రూపుల చెరలో కూడా అనేక మంది బంధీలుగా ఉండటంతో చర్చలు సంక్లిష్టంగా మారాయి.

Spread the love