– మోడీ 3.0లో ప్రతీ చర్యా అటు వైపే
– కార్పొరేట్‌కు అనుకూలం.. రైతులకు వ్యతిరేకం
– కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కోత
– పరిశోధనల కోసం బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు
– తప్పుదోవ పట్టిస్తున్న కార్పొరేటు మీడియా
– కేంద్రం విధానాలతో అన్నదాతల జీవనోపాధికి ముప్పు
– విశ్లేషకులు, నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తున్నది. రైతన్నలకు మాత్రం ఇబ్బందులను తీసుకొస్తున్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే, రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా.. వారికి కష్టాలు తీవ్రమయ్యాయి. అదే మోడీ 2.0 పాలనలోనూ కొనసాగింది. ఆ తర్వాత మూడు వివాదాస్పద సాగు చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే యత్నాన్ని చేసింది మోడీ సర్కారు. అయితే, కేంద్రం కుట్రలను గ్రహించిన రైతన్నలు తమ పోరాటాలతో ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా చేశారు. దిగొచ్చిన మోడీ సర్కారు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నది. మోడీ 2.0 పాలనలో ఇది రైతన్నల పెద్ద విజయంగా చెప్పొచ్చు.
బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేక 2024లో కేంద్రంలో సంకీర్ణ మోడీ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చింది. గతంలోలా కాకుండా ఈ సారి కచ్చితంగా మిత్రపక్షాల దయదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు కేంద్రంలోని బీజేపీకి ఏర్పడ్డాయని కొందరు వ్యాఖ్యానించారు. కానీ మోడీ 3.0 సర్కారు తన రైతు వ్యతిరేక విధానాన్ని వీడటం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. మోడీ సర్కారు విధానాల తీరే అందుకు నిదర్శనంగా ఉన్నదని వారు అంటున్నారు. గత మోడీ ప్రభుత్వ హయాంలో ప్రధాన విధాన నిర్ణయాలకు బాధ్యత వహించే వ్యక్తులను కీలక నాయకత్వ స్థానాల్లో కొనసాగించటం ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
రైతులపై కాల్పులు జరిపించిన శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యవసాయ మంత్రి
మోడీ సర్కారు.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించింది. అయితే, శివరాజ్‌సింగ్ చౌహాన్ సీఎంగా ఉన్న సమయంలో 2017, జూన్‌లో ఎంపీలోని మందసౌర్‌లో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. అన్ని పంటలకు న్యాయమైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో పాటు 50 శాతంతో రుణమాఫీ, రైతు ఆత్మహత్యలకు పరిష్కారం కోరుతూ రైతులు చేసిన నిరసనలో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం రైతన్నలపై గన్ను ఎక్కుపెట్టి వారిని అక్షరాల హత్య చేసిందని కొందరు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి నాయకుడిని తీసుకొచ్చి ఇప్పుడు కేంద్ర వ్యవసాయ మంత్రిని చేయటం ఎంత వరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం భారత్‌లోని రైతులు, వ్యవసాయ సంక్షోభం పట్ల ఎన్డీయే ఆలోచనా విధానం, దృక్పథానికి నిదర్శనమని చెప్తున్నారు.
పీఎం-కిసాన్‌పై తప్పుదారి పట్టించే ప్రచారాలు
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు నయా ఉదారవాద అజెండాను ముందుకు తీసుకుపోతున్నదనీ, ఇందులో భాగంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసే దిశంగా కృషి చేస్తన్నదని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు. మోడీ 3.0 సర్కారు నిర్ణయాలు ఈ ధోరణిని ధృవీకరిస్తున్నాయని చెప్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేటు లాభాలను పెంచుకోవటమే లక్ష్యంగా మోడీ సర్కారు పెట్టుకున్నదని వారు అంటున్నారు.
మీడియా సైతం ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తూ, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని కొందరు సామాజికవేత్తలు చెప్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం-కిసాన్) యోజన కింద రూ. 2వేలు పంపిణీ చేయటం కేవలం పైకి కనిపించే విషయమేననీ, అయితే ఈ చెల్లింపు ప్రతి రైతు కుటుంబానికి నెలకు కేవలం రూ.500 మాత్రమేనని వారు అంటున్నారు. ఈ పథకం రైతులను లాభసాటి ధర కోసం వారి న్యాయమైన డిమాండ్ నుంచి దృష్టిని మరల్చటానికి రూపొందించబడిందిగా కొందరు అభివర్ణిస్తున్నారు. 2019లో విడుదలైన పీఎం-కిసాన్ మొదట్లో 14.5 కోట్ల మంది రైతులకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, అది 9.3 కోట్ల మంది రైతులకు తగ్గటం పథకం తీరుకు అద్దం పడుతున్నది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే తెలియజేయటం గమనార్హం. ఇక ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీ ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు నిర్ణయించబడిందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకటించారు. అయితే, దీనిపై ఎలాంటి విమర్శనాత్మక పరిశీలన లేకుండానే ప్రభుత్వ కథనాన్ని కార్పొరేటు మీడియా తీవ్రంగా ప్రచారం చేసింది.
డిజిటలైజేషన్ పేరుతో కార్పొరేట్ చేతిలోకి
వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నాలను మోడీ సర్కారు ఆది నుంచే చేస్తున్నదనీ, ఇందుకోసం పలు ప్రయత్నాలు చేసిందని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా, కేంద్ర మంత్రి వర్గం గత నెల 2న డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (డీఏఎం)పై దృష్టి సారించి ఏడు కొత్త పథకాలను ప్రారంభించాలని నిర్ణయించింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకయ్యే దీని మొత్తం వ్యయం రూ.14 వేల కోట్లు. వాస్తవానికి, భారత్‌లో ఉండే రైతులు చిన్న, సన్నకారు, భూమిలేని, భాగస్వామ్య రైతులు. వీరు వ్యాపార ఆధారిత డిజిటలైజేషన్‌తో కలిసిపోతే.. దోపిడీ సంస్థలు వ్యవసాయ ఉత్పత్తిపై ఆధిపత్యం చెలాయిస్తాయనీ, దీంతో రైతుల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, వ్యవసాయ పరిశోధనను సైతం కార్పొరేటీకరించే చర్యలను మోడీ 3.0 సర్కారు మొదలు పెట్టిందని చెప్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో బేయర్, సింజెంటా, అమెజాన్ వంటి బహుళజాతి సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ పరిశోధన రంగంలోకి ఇవి భారీగా ప్రవేశిస్తే భవిష్యత్తుపై ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయ కార్పొరేటీకరణ కోసం బడ్జెట్
మోడీ 3.0 బడ్జెట్ ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ బడ్జెట్‌ను తీసుకొచ్చిందన్న ఆరోపణలు ప్రతిపక్షాలు ఇప్పటికే చేశాయి. అలాగే, వ్యవసాయ వ్యాపార లాభాలను పెంచటానికి, వ్యవసాయాన్ని మరింత కేంద్రీకరణ, కార్పొరేటీకరణ చేయటానికి బడ్జెట్‌లో దారులు సుగమం చేసిందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు 2019లో 5.44 శాతం నుంచి 3.15 శాతానికి తగ్గిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు కేటాయింపులతో పోలిస్తే ఇది 21.2 శాతం తగ్గింపును సూచిస్తున్నది. అలాగే, పంటల పెంపకానికి కేటాయింపులు 24.7 శాతం, ఎరువులకు నిధులు గతేడాదితో పోలీస్తే దాదాపు 34.7 శాతం తగ్గాయి. మొత్తంగా, రూ.87,238 కోట్లు తగ్గినట్టుగా తెలుస్తున్నది. బడ్జెట్‌లో ఈ కోతలు వ్యవసాయ ఉత్పాదకతను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రమాదమున్నదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.