అగ్రికల్చర్‌కే అగ్రతాంబూలం!

Agriculture is top priority!– రైతు రుణమాఫీకి రూ 31వేల కోట్లు
– బడ్జెట్‌లో రూ.60వేల కోట్ల కేటాయింపు దిశగా కసరత్తు
– పంటల బీమాకు పెద్దపీట
– యాంత్రీకరణకు పూర్వవైభవం
– రైతు బీమాకు ప్రీమియం బాధ్యత సర్కారుదే
– ఉద్యాన పంటలకు ఊపు
– సమపాళ్లలో సాగుకు ప్రోత్సాహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వనుంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఆ రంగానికి అగ్రతాంబులం వేయనుంది. ఆ దిశగా వ్యవసాయ, ఆర్థిక శాఖలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయ శాఖ తన ప్రాధాన్యతలను ఆర్థిక శాఖకు తెలిపింది.
ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్‌లో ఆ శాఖకు రూ.60వేల కోట్లు కేటాయించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. ఆగస్టు 15లోపు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు సిద్ధమైన సర్కారు…రెండు రోజుల్లో అందుకు సంబంధించిన విధి, విధానాలను విడుదల చేయనుంది. దీని కోసం రూ.31వేల కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీంతోపాటు రైతు భరోసాకు ఏడాదికి రూ. 21వేల కోట్లు, పంటల బీమాకు రూ. 3వేల కోట్లు, రైతుబీమాకు రూ.1500 కోట్లు, యాంత్రీకరణకు రూ వెయ్యి కోట్లు, పామాయిల్‌ సాగు కోసం రూ. వెయ్యి కోట్లు అవుతుందని అంచనా వేసింది. ఈ రకంగా ఆ రంగానికి బడ్టెట్‌లో అత్యధికంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాన్ని సమపాళ్లలో ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తున్నది.
కేసీఆర్‌ సర్కారు ఒక రైతు బంధుకే ప్రాధాన్యత ఇచ్చి మిగతా అనుబంధ రంగాలను అటకెక్కించింది.ముఖ్యంగా మార్కెట్‌ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఉద్యాన, పశుసంవర్థక శాఖలను నిర్వీర్యం చేసింది. యాంత్రీకరణ, బిందుసేద్యం, విత్తన, ఎరువుల సబ్సిడీ, పంటల కాలనీలు, ఫాలీహౌస్‌ వంటి పథకాలను ఆ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో లక్షల ఎకరాలు నీట మునిగి, రైతు నష్టపోతే వారికి కన్నీళ్లే మిగిలాయి తప్ప పరిహారం అందలేదు. దీంతో వ్యవసాయాన్ని నమ్మి సాగు చేయడం వల్ల లాభం కంటే నష్టపోతున్నామన్న అభిప్రాయం రైతుల్లో నాటుకుపోయింది. ఈ క్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అందులో భాగంగా వచ్చే బడ్జెట్‌లో ఆ రంగానికి పెద్ద పీట వేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నది.
బీఆర్‌ఎస్‌ హయాంలో…
వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని బతుకీడుస్తున్న అన్నదాతల కష్టాలను గత ప్రభుత్వం తీర్చలేకపోయింది. తొలి ఐదేండ్లలో రైతులకు విత్తనాలు, ఎరువులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ ఇచ్చినా కాలక్రామేణా వాటిని అమలు చేయలేదు. ఆ తర్వాత రైతు బంధు పథకాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. ఎకరాకు రూ 4వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉన్నా సరే రైతు బంధు ఇస్తామని ప్రకటించింది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే రూ. 5 లక్షల బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చింది. మిగతా సౌకర్యాలను మాత్రం పట్టించుకోలేదు. ఆధునిక సేద్య పద్ధతులను క్షేత్ర స్థాయిలోకి తెచ్చి రైతులకు చేరువ చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించింది. కానీ వారికి ఇతర పనులు అప్పగించడం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ముఖ్యంగా వ్యవసాయ ప్రణాళికను రూపొందించినప్పటికీ దాన్ని అమలు చేసే చర్యలు తీసుకోలేదు. రైతులు తమకు ఇష్టమెచ్చిన పంటలు వేశారు. దీని వల్ల వారు నష్టపోయిన సందర్భాలున్నాయి. పత్తి పంటకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర పండ్లు, చిరుధాన్యాల పంటల సాగు తగ్గిపోయింది. చివరకు ఆకుకూరలు, కూరకాయలను సైతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులొచ్చాయి. ఏ నేలలో ఏ పంట వేయాలో, అందుకు ప్రభుత్వం ఏ విధంగా సాయం పడుతుందో, ఆ పంటకు మార్కెట్‌ గ్యారంటీ ఉంటుందా? ఉండదా? ఇలా అనేక అనుమానాలను కేసీఆర్‌ సర్కారు తీర్చలేకపోయింది. దీంతో పంటల సమతుల్యత కూడా దెబ్బతిన్నది. దీంతో రైతులకే కాకుండా వినియోగదారులకూ ఇబ్బందులు తలెత్తాయి. పండిన వివిధ పంటలకు మద్దతు నిర్ణయించడంలో కూడా గత ప్రభుత్వంలో వైఫల్యం కనిపిస్తున్నది. మార్కెట్లలో దళారుల వ్యవస్థను రద్దు చేయలేదు. దీంతో రైతులు ఆరుగాలంపాటు కష్టపడి పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకొస్తే…దాని ధరను దళారులే నిర్ణయించే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టి సారించి వ్యవసాయాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.

Spread the love