వ్యవసాయాన్ని వైఎస్‌ఆర్‌ పండుగ చేశారు

– ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారు
– ‘రైతే రాజైతే’ పుస్తకావిష్కరణలో పాలగుమ్మి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వ్యవసాయ సంక్షోభ సమయంలో పాదయాత్ర చేపట్టిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతుల కష్టాలను చూసి చలించిపోయారని ప్రముఖ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ చెప్పారు. సంక్షోభం నుంచి వ్యవసాయాన్ని గట్టేక్కించుకు ఎన్నో పథకాలు రూపొందించారని గుర్తు చేశారు. రైతు సమస్యలు, రైతు ఉద్యమాల పట్ల వెంటనే స్పందించేవారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా అనుకూల విధానాలను అమలు చేశారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి రచించిన ‘రైతే రాజైతే…వ్యవసాయం పండుగే’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయినాథ్‌ మాట్లాడుతూ ఆయా కంపెనీలు విత్తనాల ధరలు పెంచినప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని తగ్గించారని తెలిపారు. మోన్‌సెంటో లాంటి విత్తన కంపెనీ మెడలు వంచి ధరలు తగ్గించేలా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని చెప్పారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు ఉద్యమించి, విజయం సాధించారని చెప్పారు. ఆ ఉద్యమంలో దాదాపు 725 మంది రైతులు చనిపోయారని వివరించారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా నిర్వహించిన రైతు ఉద్యమంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం…రైతులను కష్టాలపాలు చేసిందన్నారు.రైతుల ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఇప్పుడు రాజశేఖర్‌ రెడ్డి బతికుంటే రైతులకు మేలు చేసి ఉండేవారని చెప్పారు. మాజీ సీఎం దిగ్విజరు సింగ్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌తో నా అనుబంధం విడదీయరానిదని తెలిపారు. పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే కీలకంగా పని చేశారన్నారు. ఉచిత విద్యుత్‌ వైఎస్సార్‌ మానసపుత్రిక అన్నారు.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆయన మరణించకపోతే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవన్నారు. శత్రువులు కూడా మెచ్చే గుణం ఆయనకుందన్నారు. ఆయన బతికుంటే బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా నిర్వహించేవారని తెలిపారు. 2004, 2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటంలో ఆయన కీలకంగా వ్యవహరించారని తెలిపారు. దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారని గుర్తు చేశారు. సీపీఐ జాతీయ నేత డాక్టర్‌ కె నారాయణ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌తో విపక్షాలు విభేదించినా గౌరవించేవారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఆయనపై ఆర్థిక దాడులు జరిగాయని తెలిపారు. దాంతో తన బెరైటీస్‌ వ్యాపారాన్ని మూసేశారని వివరించారు. ఆ సమయంలో ప్రాంతీయ పార్టీ పెడతారా? అని నేను అడిగాననీ, కాంగ్రెస్‌తోనే ఉంటానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నరసింహరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు రుద్రరాజు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ నేత కొప్పుల రాజు తదతరులు మాట్లాడారు.

Spread the love