విమానంలో నీటి లీకేజీపై స్పందించిన ఎయిర్‌ ఇండియా

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎయిర్‌ ఇండియాకు చెందిన ఒక విమానం పైభాగం నుంచి నీరు ధారగా కారిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా స్పందించింది. ‘నవంబర్‌ 24 న గాట్విక్‌ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లిన ఎయిర్‌ ఇండియా AI169 విమానంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. క్యాబిన్‌ పైకప్పు నుంచి ఓ చోట నీరు లీకైంది. లీకేజీ కింది సీట్లో కూర్చున్న ప్రయాణికుల్ని తక్షణమే మరో చోటుకు మార్చాం. ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి కట్టుబడి ఉన్నాం. ఊహించని ఈ ఘటనకు మేం చింతుస్తున్నాం’ అంటూ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, లీకేజీకి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఎయిర్‌ ఇండియా విమానంలోని ఓవర్‌హెడ్ బిన్‌ల నుంచి నీరు లీకైంది. దీంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. నీటి లీకేజీని నివారించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. దీంతో లీకేజీ కింద కూర్చున్న ప్రయాణికుల్ని వేరే చోటుకు మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Spread the love