కాలుష్య నియంత్రణ ‘గాలి’కి

Pollution control to the 'air'– ఎన్‌క్యాప్‌ నిధుల వినియోగంలో అలసత్వం
– 82 నగరాలలో దాదాపు 66 శాతమే ఖర్చు
– ఢిల్లీలో ఇది 40 శాతం కంటే తక్కువే
– గత ఐదేండ్లలో ఇదీ పరిస్థితి
– పర్యావరణవేత్తలు, నిపుణుల ఆందోళన
ప్రపంచంతో పాటు భారత్‌నూ పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య గాలి కాలుష్యం. రోజురోజుకూ తీవ్రమవుతన్న ఈ రక్కసిని నియంత్రించటానికి ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని పలు నగరాలు, పట్టణాలను లక్ష్యంగా చేసుకుంటూ, వాయు కాలుష్య నియంత్రణ కోసం తీసుకొచ్చిన కార్యక్రమమే నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ). ఈ కార్యక్రమం కింద కోట్ల రూపాయల్లో నిధులు విడుదలవుతున్నా.. కాలుష్య నియంత్రణ కోసం పూర్తిగా నిధుల వినియోగం జరగటం లేదు. గత ఐదేండ్లుగా ఈ విషయంలో పలు నగరాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీనిపై పర్యావరణవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగాలు నిధులను పూర్తిగా వినియోగించి గాలి కాలుష్య రక్కసిని దూరం చేయాలని సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ: భారత్‌లో గాలి కాలుష్యం తీవ్రమవుతున్నది. ముఖ్యంగా, ఉత్తర భారతదేశంలో చలికాలంలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) ఆందోళనకరంగా ఉంటుంది. ఢిల్లీ, నోయిడాతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) నగరాలు, పట్టణాలు, ప్రాంతాల్లో ఈ పరిస్థితులు కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలకు శ్వాస తీసుకోవటమూ ఇబ్బందిగానే ఉంటుంది. గాలి కాలుష్య నియంత్రణ కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశంలోని 131 నగరాలకు లక్ష్యాలను నిర్దేశించింది. 40 శాతం గాలి కాలుష్య తగ్గుదలను 2025-26 నాటికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టింది.
ఎన్‌క్యాప్‌ కింద 82 నగరాలు నేరుగా నిధులను పొందుతాయి. మిగిలిన 42 నగరాలు, పట్టణాలు మాత్రం 15వ ఆర్థిక సంఘం కింద నిధులను అందుకుంటాయి. 2019 నుంచి గతేడాది మే వరకు 131 నగరాలకు పైన తెలిపిన రెండు మార్గాల ద్వారా మొత్తం రూ.10,566 కోట్ల నిధులు అందాయి. ఇందులో 82 నగరాలకు గత ఐదేండ్లలో ఎన్‌క్యాప్‌ కింద 1615.47 కోట్ల నిధులు అందగా.. ఖర్చు చేసింది 1092 కోట్లు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ నగరాల్లో మాత్రం గాలి కాలుష్యం తీవ్ర ఆందోళనకరంగా ఉన్నది. ఇక్కడ ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం నమోదవుతున్నది. గతనెలలో గాలి నాణ్యతా సూచీ(ఏక్యూఐ) 481గా నమోదై నిర్ఘాంతపర్చింది. ఇక్కడ గాలి కాలుష్యం దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నా.. నిధుల వినియోగం మాత్రం 40 శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 131 నగరాలలో 55 మాత్రమే గాలిలో పీఎం10 సాంద్రతను 20 శాతం తగ్గించాయి. ఢిల్లీ కేవలం 14 శాతం తగ్గించటం గమనార్హం.
తక్కువగా.. తప్పుగా నిధుల వినియోగం
ఎన్‌క్యాప్‌ అమలుపై కమిటీ ఆన్‌లైన్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించింది. దీని ప్రకారం.. 68 నగరాలు మాత్రం వాటికి కేటాయించిన నిధుల్లో 75 శాతాన్ని కూడా వినియోగించలేదు. ఉదాహరణకు, నోయిడాకు రూ.30.89 కోట్లను కేటాయిస్తే.. 11 శాతం నిధులే ఖర్చు చేయటం గమనార్హం. అలాగే, ఏపీ లోని విశాఖపట్టణం 14 శాతం, అనంతపూర్‌ 20 శాతం మేర ఖర్చు చేశాయి. మెట్రో నగరాల్లో.. బెంగళూరు అతి తక్కువగా 30 శాతం నిధులను వెచ్చించగా.. ఢిల్లీ (32 శాతం), పూణే (46 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక మరికొన్ని నగరాల్లో ఈ నిధుల వినియోగం తప్పుగా జరుగుతున్నట్టు సమాచారం.
అట్టడుగున ఢిల్లీ
ఇక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ) వారీగా చూసుకుంటే ఢిల్లీ ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో ఉన్నది. ఐదేండ్లలో రూ.42.69 కోట్ల నిధులు విడుదల కాగా.. ఢిల్లీ ఖర్చు చేసింది 32 శాతం. గుజరాత్‌ వంద శాతం నిధులను ఉపయోగించుకోగా, ఒడిశా (93.55 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (92.8 శాతం) లు తర్వాతి వరుసలో ఉన్నాయి. ఇక ఢిల్లీ తర్వాత తక్కువ మొత్తంలో నిధులను ఉపయోగించుకున్న రాష్ట్రాలు, యూటీలలో జమ్మూకాశ్మీర్‌ (40 శాతం), మేఘాలయ (44 శాతం)లు ఉన్నాయి.
లక్ష్యాన్ని చేరినవి 31 నగరాలే : సీఆర్‌ఈఏ
131 నగరాల్లో 31 మాత్రమే లక్ష్యాలను చేరినట్టు సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌(సీఆర్‌ఈఏ) ఒక ప్రకటనలో పేర్కొన్నది. 41 నగరాలు పీఎం10 స్థాయిలలో 20-30 శాతం తగ్గింపు అనే ప్రారంభ లక్ష్యాన్ని సాధించగలిగాయని వివరించింది. ఇందులో పారదర్శకత లోపించిందనీ, ఈ మెరుగుదల ఎలా సాధించగలిగాయన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొనటం గమనార్హం.
ఢిల్లీ ‘అసెంబ్లీ’ ప్రచారాల్లో పార్టీలు స్పందిస్తాయా?
ఢిల్లీని ప్రధానకంగా కలవరపెడుతున్న సమస్య గాలి కాలుష్యం. ఇది అక్కడి నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నది. ఈ రక్కసి కారణంగా ఢిల్లీ వాసులు శ్వాసకోశ సంబంధ వ్యాధులను ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతమని వాతావరణ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేడిలో ఉన్నది. రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ సమయం లోనైనా రాజకీయ పార్టీలు వాయు కాలుష్యంపై స్పందిస్తాయా? కాలుష్య నియంత్రణ హామీకి ముందుకొస్తాయా? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఢిల్లీ వాసులే రాజకీయపార్టీలను నిలదీసి, వారి నుంచి హామీని పొందాల్సిన అవసరమున్నదని వారు సూచిస్తున్నారు.

Spread the love