– పాపులర్ ప్లాన్ల నుంచి తొలగింపు
– చార్జీలు యథాతథం
– అదే బాటలో రిలయన్స్ జియో..!
న్యూఢిల్లీ: ప్రయివేటు టెల్కోలు ప్రజల నడ్డివిరచడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇంతకాలం డేటానే ప్రాణం.. అది అందరి హక్కు అంటూ.. అత్యంత చౌకగా ఇస్తున్నామని ఊదరగొట్టిన టెల్కోలు ఇప్పుడు అడ్డగోలుగా తమ ప్లాన్ల నుంచి డేటాను తొలగించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే భారతీ ఎయిర్‌టెల్ అనుహ్యాంగా తన రెండు పాపులర్ ప్లాన్ల నుంచి డేటాను తొలగించింది. ఇది గురువారం నుంచి అమల్లోకి రానుంది. వాయిస్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ప్రత్యేకంగా రీచార్జి ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రారు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. గతేడాది జులైలో భారీగా పెంచిన టారిఫ్ చార్జీలతో ఇప్పటికే సతమతం అవుతోన్న వినియోగదారులు.. డేటా తొలగింపునతో ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితితో అదనపు భారం పడనుంది. ఎయిర్ టెల్ రూ.509 ప్లాన్ 84 రోజుల కాలపరిమితో వస్తోందని.. ఈ రీచార్జితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయని పేర్కొంది. 365 రోజుల గడువుతో రూ.1,999 రీఛార్జి ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్‌ఎంఎస్‌లు అందించనుంది. ఈ రెండు రీచార్జి ప్లాన్లపై ఇంతకు ముందు 6జిబి డేటా కూడా అందించేది. తాజాగా ఈ డేటాకు ఎసరు పెట్టింది. త్వరలోనే రిలయన్స్ జియో కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జియో అందిస్తున్న రూ.479, రూ.1999 ప్లాన్లపై డేటా తొలగించే అవకాశం ఉందని రిపోర్టులు వస్తోన్నాయి. ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు వాయిస్, ఎస్‌ఎంఎస్‌లతో పాటు డేటా కలగలిపిన ప్లాన్లు అందిస్తున్నాయి.
వినియోగదారుల ఆగ్రహం..
గతేడాది జులైలో రిలయన్స్ జియో తొలుత టారిఫ్‌లను 25 శాతం వరకు పెంచగా… ఆ బాటలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా చార్జీల మోత మోగించాయి. ఈ దఫా ఎయిర్‌టెల్ తొలుత డేటాకు ఎసరు పెట్టగా.. మిగితా రెండు ప్రయివేటు టెల్కోలు కూడా అదే బాటను ఎంచుకోన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పెంచిన టారీఫ్‌లు భారంగా ఉన్నాయి. దీనికి తోడు ఎయిర్‌టెల్ ఇచ్చే డేటాను మాయం చేయడం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్లాన్లలో డేటాను తొలగించడంతో సాధారణంగా ధరలు కూడా తగ్గించాలి.. కానీ పాత టారీఫ్‌లనే వసూలు చేయడం గమనార్హం. ముఖ్యంగా కొద్దిపాటి డేటా వాడుకునే వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ లాంటి మెసేజింగ్ ఫీచర్లను చెక్ చేసుకోవడానికి కూడా డేటా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇకపై చిన్న అవసరాల కోసం కూడా డేటా కోసం అదనంగా నగదు చెల్లించాల్సి రావడం ద్వారా తమపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డేటా లేకుండా ప్లాన్లు ఎలా ఉపయోగపడతాయని ప్రశ్నిస్తున్నారు. ట్రారు, వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ మాత్రమే ఉపయోగించే వారి కోసం డేటా లేని ప్లాన్‌లను అందించాలని, అలాగే డేటా తొలగించినందుకు ధరలను తగ్గించాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లను తక్కువ ధరలో ప్రవేశపెట్టాల్సింది పోయి.. ఉన్న ప్లాన్లను అదే ధరలకు అందిస్తూ.. అందులోని డేటాకు ఎసరు పెట్టడం అన్యాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.