నవతెలంగాణ – ముంబాయి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబై పర్యటన సందర్భంగా సీఎం ఏక్‌నాథ్ షిండ్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఆయనను కలిశారు. అయితే అమిత్ షా కార్యక్రమాలకు అజిత్ పవార్ దూరంగా ఉన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా, ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ తన వర్గంతో కలిసి శివసేన-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూణేలోని బారామతిలో జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడారు. ‘ఈ రోజు, నాకు ఆర్థిక శాఖ బాధ్యత ఉంది. కానీ రేపు అది ఉంటుందో లేదో నేను చెప్పలేను’ అని అన్నారు. మరోవైపు అమిత్ షా కార్యక్రమానికి మిస్ కావడంపై వస్తున్న ఊహాగానాలను అజిత్ పవర్ ఖండించారు. ముందుగా ప్లాన్ చేసిన కొన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల ఆయనను కలువలేకపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అమిత్ షా కార్యాలయానికి తెలియజేసినట్లు చెప్పారు.