ఆకాశరామన్నలు…

మన తాతల కాలంలో సమాచారం చేరవేయాలంటే ఒక మనిషి వెళ్లి రావాల్సిందే. అది మంచి వార్తయినా.. చెడు వార్తయినా అతడే దిక్కు. ఆ తర్వాత దినపత్రికలు, రేడియోలు వచ్చాయి. ఇక మన కాలానికి టీవీలు వచ్చి చేరాయి. ఆ విధంగా ఆకాశవాణిలో ప్రాంతీయ వార్తలు, దూరదర్శన్‌లో న్యూస్‌ను మనందరం విన్నవాళ్లమే, చూసిన వాళ్లమే. ఆ తర్వాత ప్రయివేటు టీవీ ఛానళ్ల పుణ్యమానీ… బ్రేకింగ్‌ న్యూస్‌, ఆ తర్వాత షాకింగ్‌ న్యూస్‌ల పేరుతో మన బీపీ ఎప్పుడో హైరేంజ్‌కు వెళ్లిపోయింది. ఇక సాంకేతిక పరిజ్ఞానం మరింతగా పెరిగిన తర్వాత, స్మార్ట్‌ ఫోన్‌, ఫోర్‌ జీ, ఫైవ్‌ జీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచారం అనేది విస్ఫోటమైంది. ఆ విస్ఫోటనం ఒక్కోసారి అవసరానికి పనికొస్తూ, మన అవగాహనను పెంచుతూ ఉంటే.. మరికొన్ని సార్లు అనవసరమైన, అవసరానికి మించిన ఇన్ఫర్మేషన్‌ బుర్రల్ని కరాబు చేస్తూ, జనాల్ని చికాకు పరుస్తూ ఉంది. ఇవి చాలదన్నట్టు నిర్దారణ లేని అసత్య వార్తలు, ఫేక్‌ న్యూస్‌ పిచ్చెక్కిస్తున్నాయి. తాజాగా అగ్రనటుడు చిరంజీవి ఈ తప్పుడు, వక్రీకరణ వార్తల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఏదో సందర్భంలో ఎక్కడో మాట్లాడిన మాటలను వంకరగా వక్రీకరించి… ‘చిరంజీవికి గతంలో క్యాన్సర్‌ వచ్చింది.. చికిత్స తీసుకున్న తర్వాత అది తగ్గింది…’ అంటూ సోషల్‌ మీడియాలో రాసేసరికి, ఆయన చాలా బాధపడ్డారు. ఆరోగ్య సమస్యలు, ముందు జాగ్రత్తల గురించి మాట్లాడే సందర్భంలో తాను క్యాన్సర్‌ గురించి ప్రస్తావిస్తే.. తనకే క్యాన్సర్‌ వచ్చిందంటూ ప్రచారం చేయటమేంటంటూ మెగాస్టార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ శాసనసభకు ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందంటూ శనివారం పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేసరికి…అదో పెద్ద హాట్‌టాపిక్‌ అయ్యింది. చివరికి ఎన్నికల సంఘం చెప్పిందొకటి.. సామాజిక మాధ్యమాల్లో వచ్చింది మరోటి అనేది తేలింది. ఇలా నిజమా..? కాదా..? అనేది తెలుసుకోకుండా, నిర్దారణ లేకుండా, ఊరూ పేరూ లేని ఆకాశరామన్నలు రాసే వార్తలు, చేసే పోస్టుల గురించి జనాలు తెగ కంగారు పడిపోతున్నారు. సో…సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త…
-బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love