శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై అప్రమత్తమైన కేంద్రం .. 6 రాష్ట్రాల్లో అలర్ట్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ: శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. రాజస్థాన్‌, కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. దీంతో శ్వాసకోశ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆస్పత్రులు, ఆరోగ్య సిబ్బందిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి.సీజనల్‌ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ సూచించింది. సీజనల్‌ ఫ్లూ లక్షణాలను వివరిస్తూ ఓ నివేదికను జారీ చేయడంతో పాటు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జాబితా చేసింది. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు నోరు, ముక్కును కవర్‌ చేయాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని, చేతులతో ముఖాన్ని తాకవద్దని హెచ్చరించింది. ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజస్థాన్‌ ఆరోగ్య శాఖ పేర్కొంది.
అయితే ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని హెచ్చరించింది. చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించింది. పిడియాట్రిక్‌ యూనిట్లు, మెడికల్‌ విభాగాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. కొవిడ్‌ సమయంలో అప్రమత్తమైనట్లు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు గుజరాత్‌ ఆరోగ్య మంత్రి రుషికేశ్‌ పటేల్‌ తెలిపారు.  శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రిలో చేరితే తక్షణమే రిపోర్టు చేయాలని హర్యానా ఆరోగ్య శాఖ ఆదేశించింది. తమిళనాడు, ఉత్తరాఖండ్‌లోనూ  ఇదే విధమైన హెచ్చరికలు జారీ అయ్యాయి.

Spread the love