– రైతులతో గొయ్యి తీయించి.. అదే గోతిలో పూడ్చిన రజాకార్లు
– రైతుల సజీవ ఖననంతో ఎగిసిన ఉద్యమం
– రజాకారు క్యాంపులపై కమ్యూనిస్టుల మెరుపు దాడి
– సుందరయ్య సూచన మేరకు రాచకొండ గుట్ట కేంద్రంగా పనిచేసిన కమ్యూనిస్టు దళాలు
– లక్షల ఎకరాల్లో భూ పంపిణీ
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పన్నుల పేరుతో నిజాం సర్కారు రైతులను చిత్ర హింసలకు గురిచేసి అమాయక రైతులను పొట్టన పెట్టుకుంది. రంగారెడ్డి జిల్లాలో రైతాంగ సాయిధ పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో నిజాం సర్కారుకు ఎందుకు భూ శిస్తు చెల్లించాలని.. ఎదురుతిరిగిన రైతులు సోమయ్య, మల్లయ్యను రజాకార్‌లు బంధించి బోడకొండ ఖిల్లాపై సజీవ ఖననం చేశారు. రైతుల చేతులతో గొయ్యి తీయించి.. అదే గోతిలో వారిని సజీవంగా పాతిపెట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.
రైతాంగ సాయుధ పోరాటాన్ని అణిచివేసేందుకు కాశీం రిజ్వీ నేతృత్వంలో శివన్న గూడ కేంద్రంగా పనిచేస్తున్న రజాకార్‌ల క్యాంపు కౌలు రైతులను చిత్ర హింసలకు గురిచేసింది. మంచాల మండలానికి చెందిన సోమయ్య, మల్లయ్య రజాకార్‌లకు వ్యతిరేకంగా భూమి శిస్తూ చెల్లించొద్దని రైతులను కూడగట్టే ప్రయత్నం చేశారు. దాంతో గ్రామంలో మాటుగాసిన రజాకార్‌లు సోమయ్య, మల్లయ్యను బంధించి.. శివన్నగూడ గ్రామ పంచాయతీ వద్ద వారి వీపున బండరాళ్లు మోపి, రెండు రోజులు అలాగే హింసించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న రైతులను వారం రోజుల తర్వాత మళ్లీ పట్టుకుని బోడకొండ ఖిల్లాకు తీసుకెళ్లి.. రైతుల చేతులతోనే గొయ్యి తీయించి, వారు తీసిన గోతిలోనే రైతులను సజీవంగా బొందపెట్టారు. ఈ ఘటనతో రాచకొండ గుట్ట కేంద్రంగా పనిచేస్తున్న కాచం కృష్ణమూర్తి, భీంరెడ్డి రాంరెడ్డి దళం రజాకార్‌ల క్యాంపుపై మెరుపు దాడి చేసి రజాకారుల వద్ద బందీగా ఉన్న మరికొంత మంది కౌలు రైతులను రక్షించారు. శివన్న గూడెం రజాకార్‌ల క్యాంప్‌పై దాడి చేసిన కమ్యూనిస్టు దళాలు పేదలకు భూ పంపిణీ చేశాయి. ఈ ఘటనతో జిల్లాలో ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ ఉద్యమంలో ప్రజలు వెల్లువలా కదిలి రావడంతో నాటి నైజాం ప్రభుత్వం గడగడలాడింది. దాంతో ఉద్యమాన్ని అణిచి వేయాలని ప్రభుత్వం రజాకారులను ఊర్ల మీదకు పంపింది. ఈ ముష్కరులు ఊర్ల మీద పడి దాడులకు ఉపక్రమించారు.
సుందరయ్య సూచనల మేరకు కృష్ణమూర్తి రాచకొండ గుట్టల్లో రక్షణ తీసుకుంటూ ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని కొనసాగించారు. రాచకొండ ప్రాంతంలో దళాలను సిద్ధం చేశారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, దారుర్ ప్రాంతాల్లో ఉద్యమాన్ని విస్తరించారు. యువత ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆయా ప్రాంతాల్లో భూస్వాములకు ముచ్చెమటలు పట్టించారు. బర్ల శివయ్య, పోచమోని జంగయ్య, అడివయ్య, కుకడాల జంగారెడ్డి, పోచయ్య, అరుట్ల గ్రామానికి చెందిన దానయ్య సాయుధ పోరాటంలో కీల భూమిక పోషిస్తూ ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.