చట్టం ముందు అందరూ సమానులే

All are equal before the law– అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో నా ప్రమేయం లేదు
– ప్రస్తుతం క్యాబినెట్‌ విస్తరణపై చర్చేమీ లేదు : పార్లమెంట్‌లో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హీరో అల్లు అర్జున్‌ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్లమెంటలో కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన కాసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘చట్టం ముందు అందరూ సమానులే. చట్టపరమైన ప్రక్రియ జరుగుతోంది. తొక్కిసలాటలో ఒకరు మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు’ అని చెప్పారు. అయితే మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్‌ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని గుర్తు చేశారు.
మంత్రివర్గ ప్రస్తావనే లేదు
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చేమీ లేదని సీఎం స్పష్టం చేశారు. ఓవైపు సీరియస్‌గా పార్లమెంట్‌ సమావేశాలు, మరో వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో మంత్రివర్గ ప్రస్తావన ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఒకవేళ అలాంటిదే ఉంటే, పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం, ముఖ్యనేతలంతా కలిసి అధిష్టానంతో చర్చలు జరపాల్సి ఉంటుందని తెలిపారు. వాళ్ళంతా లేకుండా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు ఎలా జరుగుతాయని అన్నారు.

Spread the love