– ఎర్రజెండా నీడన పేదల గుడిసెలు
– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కాలనీలకు నామకరణోత్సవం
– జక్కలొద్దికి ప్రగతినగర్,, బెస్తం చెరువు కాలనీకి లక్ష్మీపురం పేరు
– పేదలు తమ శక్తిని తెలుసుకోవాలి : తమ్మినేని వీరభద్రం
– నూతన గృహాలకు ప్రారంభోత్సవం
నవతెలంగాణ-మట్టెవాడ
పేదలు కలిసికట్టుగా పోరాడితే వారికి కావలసినవి ఖచ్చితంగా సాధించుకోవచ్చని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వరంగల్ జిల్లా రంగసాయిపేటలో జక్కలొద్ది, బెస్తం చెరువు గుడిసె సెంటర్ల కాలనీ నామకరణ మహోత్సవ సభకు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్యతో కలిసి తమ్మినేని హాజరయ్యారు. వీరికి గుడిసెవాసులు.. పూలు జల్లుతూ బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలికారు. అనంతరం జక్కలొద్ది సెంటర్‌లో గుడిసెవాసులు కట్టుకున్న నూతన గృహాలకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సెంటర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. జక్కలొద్ది గుడిసె వాసుల పోరాటాలకు సజీవ సాక్ష్యంగా ఉన్న మహా వృక్షం వద్ద ఏర్పాటు చేసిన అమరు వీరుల స్మృతి స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం జక్కలొద్ది కాలనీకి ప్రగతినగర్ అని, బెస్తం చెరువు కాలనీకి లక్ష్మీపురంగా నామకరణం చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రంగసాయిపేట కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడారు. ఏడాది కాలంగా ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి జక్కలొద్ది, బెస్తం చెరువులో భూ పోరాటాలు చేస్తూ గృహాలు నిర్మించుకున్న గుడిసెవాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ సొంతింటి కల నెరవేరుస్తామంటే ఎదురుచూసిన పేదలకు ఓపిక నశించగా.. సీపీఐ(ఎం) ఇచ్చిన భూ పోరాటాల పిలుపుతో ఎర్రజెండా నీడన గుడిసెలు వేసుకున్నారన్నారు. జక్కలొద్దిలో గుడిసె స్థలాల కోసం చేసిన పోరాటాలు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని, అందుకు మీరు చేసిన ఐక్యపోరాటాలే కారణమని తెలిపారు. ఏడాది కాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ స్థలాన్ని దక్కించుకున్నారని, ఇదే ఐక్యమత్యంతో పోరాడితే ఈ స్థలాలకు పట్టాలు కూడా దక్కుతాయని స్పష్టంచేశారు. సీపీఐ(ఎం) మీ వెంట ఎప్పుడూ ఉంటుందని, ఎవరు ఎన్ని చెప్పినా పార్టీ జెండాను వదలకుండా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నాగయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతోందని, పేదలు బీజేపీ మాయలో పడొద్దని, భూ పోరాటాల స్ఫూర్తితో మతతత్వ రాజకీయ పార్టీలపై పోరాడాలని అన్నారు. మనం ఓట్లేసిన నాయకులు ఏసీ బిల్డింగ్‌ల్లో ఉంటున్నారు కానీ మనం మాత్రం గుడిసెలు వేసుకొని అనేక ఇబ్బందులు పడుతూ బతుకుతున్నా, మన దగ్గరకి ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు జి. రాములు మాట్లాడుతూ.. రంగు రంగుల జెండాలు ఎన్నో.. మనల్ని మోసం చేసాయి కానీ పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎప్పుడు మీవైపు ఉంటుందని స్పష్టంచేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ.. మీ పోరాటం దేశంలో అన్ని భూపోరాటాలకి ఆదర్శం అని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో కాలనీకి కరెంట్, తాగునీరు, రోడ్లు వచ్చేవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమళ్ళ రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఇస్సంపెల్లి బాబు, సింగారపు బాబు, సమ్మయ్య, హనుమకొండ శ్రీధర్, బషీర్, యాదగిరి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామస్వామి, కేవీపీస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, ప్రజానాట్య మండలి అధ్యక్ష, కార్యదర్శులు దుర్గయ్య, అనిల్, ఏరియా కమిటీ సభ్యులు, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు, పార్టీ శాఖ కార్యదర్శులు, కమిటీ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.