కాంపిటేటివ్‌ అథారిటీ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే

– స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌కు సవరణ
– ఉత్తర్వులు జారిచేసిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని వైద్య కళాశాల ప్రవేశాల నిబంధనలకు రూల్స్‌కు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్‌ విభజన చట్టం, ఆర్టికల్‌ 371డీ నిబంధనలకు లోబడి వీటిని సవరించారు. దీని ప్రకారం, 2014 జూన్‌ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లోని కాంపిటేటివ్‌ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు వీటిలో 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15శాతం అన్‌ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఎంబీబీఎస్‌ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్‌ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించడంతోపాటు, ఇక్కడి విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్‌ జిల్లాకో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రయివేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్‌ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేరింది. గతంలో తెలంగాణలో 2,850 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8,340 సీట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందున్న ఉన్న 20 మెడికల్‌ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో 15శాతం అన్‌ రిజర్వుడు కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే, పెరిగిన మెడికల్‌ కాలేజీల్లో కూడా 15శాతం అన్‌ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్‌ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్‌ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్‌ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజాగా సవరించింది. దీంతో 520 మెడికల్‌ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్‌ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్‌ రిజర్వ్‌ చేసుకోవడం వల్ల ఇక్కడి విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్‌ సీట్లు విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 1820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. అంటే దాదాపు ఇది 20 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగినా కొద్ది ఈ సీట్ల మరింత పెరగనుంది. కొత్త మెడికల్‌ కాలేజీల్లో అల్‌ ఇండియా కోటా కింద 15శాతం సీట్లు యధాతదంగా ఉంటాయి. దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్‌ ప్రకారం అడ్మిషన్‌ పొందవచ్చు.
కల సాకారం దిశగా అడుగులు : వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్‌ కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. ఏండ్ల కాలం నుంచి వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలు ప్రభుత్వ నిర్ణయాల వల్ల మెడిసిన్‌కు దగ్గర అవుతున్నాయి. తెలంగాణ సోయితో ఆలోచించిన ప్రభుత్వం ఇక్కడి విద్యార్థులకు అదనంగా 1820 మెడికల్‌ సీట్లు వచ్చేలా చేసింది. అందువల్ల విద్యార్థులు డాక్టర్‌ కావాలనే కలను సాకారం చేసుకోవాలి. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తూ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
వైద్య విద్యార్థుల సీట్ల పెంపుపై హర్షం: తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యార్థుల పెేరెంట్స్‌ అసోసియేషన్‌
రాష్ట్రంలో ప్రభుత్వం ఎంబీబీఎస్‌ సీట్లను పెంచడం పట్ల తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యార్థుల పేరెంట్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు డి.రవిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ఇ. చంద్రశేఖర్‌, ముఖ్య సలహాదారులు రాయల సతీష్‌బాబు, కష్ణారెడ్డి, శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంపిటేటివ్‌ అధారిటీ కోటాలో 100 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు దక్కే విధంగా ఉత్తర్వులు జారీ చేయడమనేది వైద్యవిద్యను అభ్యసించాలనే విద్యార్థులకు శుభవార్త అని పేర్కొన్నారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love