అర్హులందరికీ రుణమాఫీ అందాలి

All eligible should get loan waiver– రైతు భరోసా ఇవ్వాలి
– 29న రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అర్హులైన రైతులందరికీ రూ. రెండు లక్షల వరకు రుణ మాపీతో పాటు రైతు భరోసాను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 29న రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నాలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి పిలుపునిచ్చింది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ పథకం అమలు కాకపోవటంతో వారు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు జరిపిన మాఫీ 50 శాతం మంది రైతులకే వర్తించిందన్నారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. అనేక జిల్లాల్లో ఆధార్‌, రేషన్‌ కార్డును గమనంలోకి తీసుకుని రుణమాఫీ చేసినట్టు మంత్రులు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అర్హతలున్న వారికి కూడా రుణమాఫీ వర్తింపజేయలేదని తెలిపారు. అనేక ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించిందని గుర్తు చేశారు. రైతుల్లో పెరుగుతున్న అశాంతిని నివారించేందుకు తక్షణమే రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులను పరిగణనలోకి తీసుకోరాదనీ, రుణమాఫీ జరిగిన వారికి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Spread the love