– మసకబారిన అకాలీల ప్రాబల్యం
– ఫిరాయింపుల పైనే బీజేపీ ఆశలు
– మత విభజనకు నో ఛాన్స్
– ప్రాభవం కోల్పోతున్న అకాలీదళ్
– కాంగ్రెస్, ఆప్ నుంచి గట్టి పోటీ
సార్వత్రిక ఎన్నికల పోరు చివరి దశకు చేరుకోబోతోంది. ఏడవ, చివరి విడత ఎన్నికల్లో భాగంగా రేపు పంజాబ్లో కూడా పోలింగ్ జరుగనుంది. ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. చివరి దశ పోలింగ్లో ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నప్పటికీ అందరి దృష్టీ పంజాబ్ పైనే ఉండడం విశేషం. పంజాబ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యేది 13 మంది సభ్యులే. ఏ పార్టీ గెలిచినా దాని ఫలితం దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపదు. అయినప్పటికీ పంజాబ్ ఓటర్లు ఇవ్వబోయే తీర్పు ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుండడానికి ఓ కారణం ఉంది. పంజాబ్లో ఉవ్వెత్తున ఎగసిన రైతు ఉద్యమం కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. 1997 నుంచి ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి. అయితే రైతుల ఆందోళన కారణంగా ఆ పార్టీలు ఇప్పుడు వేర్వేరుగా బరిలో దిగాయి. అవే శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), బీజేపీ.
చండీఘర్ : సిక్కుల ప్రయోజనాల కోసం కృషి చేసిన సుదీర్ఘ చరిత్ర అకాలీలది. జాతీయ స్థాయిలో కూడా వీరు సిక్కుల కోసం పోరాటాలు చేశారు. కాంగ్రెస్ మినహా ఏదో ఒక పార్టీతో జట్టు కట్టి 1966 వరకూ అకాలీలు అధికారంలో భాగస్వాములయ్యారు. పంజాబ్ రాజకీయాల్లో అకాలీదళ్కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే. అదే సమయంలో సిక్కుల వ్యవహారాల్లో అకాలీల ఆధిపత్యం కొనసాగింది. శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ)పై కూడా వారి పెత్తనమే సాగింది. అయితే 2017 నుంచి పంజాబ్ రాజకీయాల్లో అకాలీల ఆధిపత్యానికి గండి పడడం ప్రారంభమైంది. ఆ సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. గత లోక్సభ ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. 2022 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. దీంతో అకాలీల ప్రాభవం మసకబారింది.
కార్యకర్తల బలంతో…
ఈ ఏడాది… ప్రజాబాహుళ్యం కలిగిన నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ మరణం తర్వాత అకాలీలు తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోటీకి దిగారు. కాంగ్రెస్ నుండే కాకుండా అమ్ఆద్మీ పార్టీ నుంచి కూడా వీరికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పుడు రాష్ట్రంలో అకాలీల పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. మిత్రపక్షం లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి వారికి లేదు. అయినప్పటికీ అకాలీదళ్కు కార్యకర్తల బలం అధికంగానే ఉంది. ఇప్పటికీ ఆ పార్టీని తక్కువగా అంచనా వేయలేమన్నది పరిశీలకుల అభిప్రాయం. పంజాబ్ బచావో నినాదంతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది.
ఫిరాయింపులే బలం
ఇక బీజేపీ విషయానికి వస్తే ఫిరాయింపుదారులే దాని బలం. జలంధర్, లూథియానా, పాటియాలా లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలే. ఫరీద్కోట్ నుంచి పోటీ చేస్తున్న హన్స్ రాజ్ హన్స్ గతంలో ఢిల్లీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలోని 13 లోక్సభ స్థానాలకూ సొంతంగా అభ్యర్థులను నిలిపింది. రాష్ట్ర అధ్యక్షుడు సహా ఆ పార్టీ నేతల్లో చాలా మంది కాంగ్రెస్, అకాలీదళ్ నుంచి వచ్చిన వారే. అకాలీదళ్కు అందడండలుగా ఉంటున్న సిక్కులను ఆకర్షించడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అవేవీ ఫలించడం లేదు. పైగా రైతుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. బీజేపీ అభ్యర్థులు అన్నదాతల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది.
సిక్కులను పట్టించుకోని మోడీ
పంజాబ్లో ఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీ, అమిత్ షా సహా పలువురు జాతీయ నేతలు తరలి వచ్చారు. అయితే వీరి ప్రచారమంతా పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది.
ఇతర రాష్ట్రాల్లో తాను ప్రస్తావించిన అనేక అంశాలను మోడీ పంజాబ్ ప్రచారంలో లేవనెత్తలేదు. ఆయన చెప్పిన ప్రధానమైన విషయం ఒకటే ఒకటి. ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే కుల ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తుందని అంటూ ప్రజల్లో భయాందోళనలు రేపే ప్రయత్నం చేశారు. మోడీ తన ప్రసంగాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ సిక్కులను విస్మరించారు. పంజాబ్ జనాభాలో వీరు 58 శాతంగా ఉన్నారు.
పారని ‘విద్వేష’ పాచిక
గతంలో తాను చేసిన ప్రసంగాలను సిక్కులు పట్టించుకోరని, పైగా తాను తీసుకున్న ముస్లిం వ్యతిరేక వైఖరిని సమర్ధిస్తారని మోడీ భావిస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే పంజాబ్లో సిక్కులకు ముస్లింలు అంటే ద్వేషభావమేమీ లేదు. మతం, కులం ప్రాతిపదికన వివక్ష చూపరాదని సిక్కు గురువులు చేసిన బోధనలు వారిపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి. 2014, 2019లో పంజాబ్లో మోడీ పర్యటించినప్పుడు అక్కడి సిక్కుల మనసు దోచుకునేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈసారి మాత్రం కొంతమేర ఆ ప్రయత్నం చేశారు. సిక్కులతో తనకు రక్తసంబంధం ఉన్నదని చెప్పుకొచ్చారు. గురు గోవింద్ సింగ్ ఎంచుకున్న ఐదుగురిలో ఒకరి తరంతో తనకు సంబంధం ఉన్నదని తెలిపారు. అయితే మోడీ మాటలను సిక్కులు విశ్వసించడం లేదు. పైగా తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఆప్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు ఆరోపణలు చేశారు. కానీ అవి కూడా పంజాబ్ ఓటర్లను ప్రభావితం చేయలేదు.
ఇతర రాష్ట్రాల్లో హిందువులు-ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి విద్వేషాలు వ్యాప్తి చేసేందుకు మోడీ, షా ద్వయం ప్రయత్నించింది. అయితే అది పంజాబ్లో సాధ్యం కాదు. ఎందుకంటే పంజాబ్లో ముస్లిం జనాభా చాలా తక్కువ. పంజాబ్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం సాధ్యం కాదని తేలిపోవడంతో ఇరువురు నేతలు నీటి నుండి బయటపడిన చేపల మాదిరిగా విలవిలలాడుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానించారు.