శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ ప్రజలే కాదు…ఇప్పుడు దేశ ప్రజలందరూ సుప్రీంకోర్టు వైపే ఉత్కంఠగా చూస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతోంది. రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 ఆగస్ట్ ఐదవ తేదీన రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ ప్రాంతానికి గతంలో కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని ఈ తీర్పు ద్వారా అత్యున్నత న్యాయస్థానం తిరిగి కొనసాగిస్తుందని జమ్మూకాశ్మీర్ ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.
ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 20కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. పదహారు రోజుల విచారణ అనంతరం సెప్టెబర్ ఐదున న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజరు కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవారు, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. సోమవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో శాంతి భద్రతల అదనపు డీజీపీ విజరు కుమార్ సమావేశం నిర్వహించారు. సీనియర్ పోలీస్, పౌర అధికారులు హాజరైన ఈ సమావేశంలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చించారు.
తీర్పుపై తాము ఆశాభావంతో ఉన్నామని పిటిషనర్లలో ఒకరైన మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ న్యాయమూర్తి హస్‌నైన్ మసూదీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చట్టవిరుద్ధమని, దానిని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరామని చెప్పారు. ‘కేంద్రం నిర్ణయం తీసుకోగానే న్యాయస్థానం తలుపు తట్టాము. ప్రభుత్వ నిర్ణయం మా హక్కులను కాలరాస్తోంది. న్యాయస్థానం మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే అది రాజ్యాంగ విరుద్ధమైన చర్య’ అని వివరించారు. అయితే రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లోని అనేక మంది మాత్రం తీర్పుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. తనకేమీ ఆశలు లేవని మాజీ మంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ సీనియర్ నేత నయీమ్ అక్తర్ పెదవి విరిచారు. ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమలులో ఉన్న ప్రక్రియకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడితే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందని చెప్పారు. తదనంతర పరిణామాలు, రాజకీయ మార్పిడులను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పటి జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్థానికులు, ప్రాంతీయ నాయకత్వ అభిప్రాయాలకు విరుద్ధంగా జరిగింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని లఢక్ సహా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. దీనివల్ల తమ గుర్తింపు, భద్రతకు ముప్పు కలుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తరిగామి ఆశాభావం
కాగా తీర్పుపై పిటిషనర్లలో ఒకరైన సీపీఐ (ఎం) నేత యూసఫ్ తరిగామి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ తీర్పు మా హక్కులు, గౌరవానికి సంబంధించినది. జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కులకు గ్యారంటీ ఇస్తున్న రాజ్యాంగబద్ధతకు సంబంధించినది. 2019 ఆగస్టులో జరిగింది ముమ్మాటికీ రాజ్యాంగం పైన, జమ్మూకాశ్మీర్‌ను భారత సమాఖ్యతో కలిపే బంధం పైన దాడే’ అని ఆయన చెప్పారు. దీనిని కేవలం తన ఒక్కడి పిటిషన్‌గా చూడరాదని, ఇది దేశ ప్రజలందరికీ సంబంధించినదని తెలిపారు. కేంద్రం నిర్ణయంతో తమ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చీలిపోయిందని అంటూ తమకు న్యాయం జరగడం, రాజ్యాంగానికి రక్షణ లభించడం ఇప్పుడు ముఖ్యమని తరిగామి అన్నారు.