– మంత్రి ఉత్తమ్ విమర్శ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. బనకచర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవమన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో నదీ జలాల విషయంలో చాలా నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. మేం అధికారంలోకి వచ్చాక నష్టం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. బనకచర్ల విషయంలో అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి లేఖ రాశామని చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధం, ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించవద్దని విజ్ఞప్తి చేశాం’ అని ఆయన చెప్పారు. బనకచర్లను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీజలాలు, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ పదేండ్ల కాలంలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని 2015లో మేము కోరామనీ, బీఆర్‌ఎస్ నేతలు మాత్రం 299 టీఎంసీలు చాలని ఒప్పుకున్నారని గుర్తుచేశారు. హరీశ్‌రావు ఇష్టానుసారంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని విమర్శించారు. పాడి కౌశిక్‌రెడ్డి ప్రవర్తన సరిగ్గా లేదని వాఖ్యానించారు. రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడు కరీంనగర్ సమావేశం లో ఇష్టానుసారం వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడటం, ప్రవర్తించడం భావ్యం అనిపించుకోదని అభిప్రాయపడ్డారు.