సకల జీవులకూ ఈ భూమిపై జీవించే హక్కు

All living beings have the right to live on this earth– ఏనుగుల దినోత్సవం సందర్భంగా సదస్సు పెట్టడం అభినందనీయం : రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈ భూమి మనుషులకు మాత్రమే ఆవాసం కాదనీ, సకల జీవులకూ జీవించే హక్కు ఉందనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ ఏనుగు దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం బెంగుళూరులో నిర్వహించిన ”ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ హ్యుమన్‌-ఎలిఫెంట్‌ కాన్ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌” సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ, వాటి సంరక్షణ, నిర్వహణపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కర్నాటక ప్రభుత్వం ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సదస్సును చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల నిర్వహణ రంగంలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌(ఐయూసీఎన్‌) అంతరించిపోతున్న వ్యప్రాణుల జాబితాలో ఆసియా ఏనుగులను చేర్చడం మానవ వైఫల్యాన్ని నిరూపిస్తున్నదని ఆందోళన వెలిబుచ్చారు. దంతాల కోసం ఏనుగులను క్రూరంగా వేటాడటం దారుణమన్నారు. అటవీ భూములు, నీటి వనరుల ఆక్రమణ, అడవుల నిర్మూలనతో ఏనుగులు ఆవాసం కోల్పోయి, ఆహార సేకరణ కోసం వలసపోతూ ప్రమాదాలను ఎదుర్కంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల ఆవాసాల్లో అటవీసంపద, నీటి వనరులను మెరుగుపరచడం, ఏనుగులు పంట పొలాల్లోకి, జనావసాల్లోకి వచ్చినపుడు సంయమనంతో వ్యవహరించడం ద్వారా అవి ప్రమాదాలకు లోనుకాకుండా నివారించవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్‌, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ బి ఖండ్రే, పలు రాష్ట్రాల అటవీ శాఖా మంత్రులు, దేశ, విదేశాలకు చెందిన పలువురు అటవీరంగ నిపుణులు, రీసెర్చ్‌ స్కాలర్లు, పలువురు పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, తదితరులు పాలగొన్నారు.

Spread the love