తుది ఓటర్‌ జాబితా పారదర్శకంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి

– ఉమ్మడి జిల్లా ఎలక్ట్రోలర్‌ అబ్జర్వర్‌ నిర్మల
నవ తెలంగాణ -భువనగిరి రూరల్‌
తుది ఓటరు జాబితా పారదర్శకంగా, పక్కాగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ఎలక్టోరల్‌ అబ్జర్వర్‌ నిర్మల సూచించారు.మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల ఈ.ఆర్‌.ఓ.లు, ఎ.ఈ.ఆర్‌ఓ. లతో ఆమె మండలాల వారీగా ఫారం 6,7,8 దరఖాస్తులపై సమీక్షించారు. తుది ఓటరు జాబితా ఎలాంటి పొరపాట్లకు అస్కారం లేకుండా, పారదర్శకంగా, పక్కాగా రూపొందించాలని అధికారులకు సూచించారు. జిల్లా రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ ఏ భాస్కరరావు వివరిస్తూ గత సెప్టెంబర్‌ 26, 27, ఈనెల 2, 3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, జిల్లాలోని 421 గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ట్రాక్టర్ల ద్వారా ఓటరు నమోదుపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని, ప్రతి బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వివరాలను అందించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జి వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా భాగంగా ఓటు నమోదు, ఓటరు చైతన్యంపై విద్యా సంస్థలలో స్వీప్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రెవెన్యూ డివిజనల్‌ అధికారి పి అమరేందర్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బహుజన సమాజ్‌ పార్టీ నుండి బట్టు రామచంద్రయ్య, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నుండి ప్రోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌, కూర వెంకటేశం, ఈరపాక నరసింహ, సిపిఎం నుండి బట్టుపల్లి అనురాధ, భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కిరణ్‌ కుమార్‌, వేణుగోపాల్‌ రెడ్డి, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నాగేశ్వర చారి, తహసీల్దారులు, డిప్యూటీ తాసిల్దారు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love