ఆరు హామీలూ మోసపూరితమే

– బీఆర్‌ఎస్‌పై రాహుల్‌ ఆరోపణలు హాస్యాస్పదం : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదనీ, ఆరు హామీలూ మోసపూరితమేని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి 2004లో టీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కాంగ్రెస్‌ చేసిన ఆలస్యమే వందలామంది చావులకు కారణమైనదని ఆరోపించారు. కేసీఆర్‌ నేతృత్వంలో పోరాటం ఉధృతం కావడంతో అనివార్యంగా కాంగ్రెస్‌ దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు బాగా లేద నీ, ప్రజలు ఆ విషయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. మోసం చేయడం కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు అని, అభివృద్ధి బీఆర్‌ఎస్‌ ట్రాక్‌ రికార్డ్‌ అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అవినీతి పార్టీ అని రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణను ఖండిం చారు. స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్‌ ను సరిచూసుకొని మాట్లాడాలని హిత వు పలికారు. రూ. 80 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

Spread the love