గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలివ్వాలి

– ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలి : జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ప్రజా సంఘాల ధర్నా, భారీ ర్యాలీ
నవతెలంగాణ – ములుగు
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని, ఇండ్లు లేని వారికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మంగళవారం పేదలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అంతకు ముందు డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.తీశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు ఎండీ అమ్జద్‌ పాషా అధ్యక్షతన జరిగిన ధర్నాలో సూడి కష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వ వాగ్దానం అమలుకు నోచుకోలేదన్నారు. సొంత ఇంటి స్థలం లేని నిరుపేదలు ప్రభుత్వంపై ఆశతో ఏండ్ల తరబడి ఎదురు చూసి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 65 కేంద్రాల్లో సుమారు లక్ష మందికి పైగా పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని, వారందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ములుగు జిల్లా పస్రాలో వందలాది మంది పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, వారికి ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు.. భూ కబ్జాదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అధికార పార్టీ అండదం డతో అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాధుడే లేడన్నారు.
కానీ పేదలు 100 గజాల స్థలం ఆక్రమిస్తే పోలీసులు వారి ఇండ్లను కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో భవిష్యత్తులో విస్తృత పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ధర్నాలో రైతు సంఘం జిల్లా నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండీ గఫూర్‌ పాషా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, ఐద్వా జిల్లా నాయకులు కవిత, కారం రజిత, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొచ్చు సంజీవ, రత్నం ప్రవీణ్‌, గుడిసెవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love