కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలి

– వరి క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాలి
– రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు పరచాలి
– రైతుల కోసం పోరుబాటలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
– హామీలు అమలు చేసే వరకు ప్రజల తరపున పోరాడుతా
– నాపై ఎన్ని కేసులు అక్రమంగా పెట్టాలని చూసిన వెనక్కి పోయేది లేదు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని, వరి క్వింటాలుకు అదనంగా రూ.5 వందలు బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు పరచాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం  బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు బాల్కొండ, వేల్పూర్, మెండోరా, ముప్కాల్ మండలాల రైతులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల కోసం పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వరికి క్వింటాలుకు అదనంగా రూ.5 వందలు బోనస్ ఇవ్వాలని, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సాక్షిగా అప్పటి సీఎల్పీ లీడర్, ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎం.ఎస్.పి ధర కంటే అదనంగా క్వింటాలుకు రూ.5 వందలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.మీకు మీరుగా ఇచ్చిన 100 రోజుల గడువు పూర్తి అయ్యి 120 రోజులు గడిచినందున  ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే హామీలు అమలు అయ్యే వరకు మీ వెంట పడుతాం.. ప్రజల తరపున పోరాడుతామన్నారు.ఎంపీ ఎన్నికలు ఉన్నప్పుడే ఇచ్చిన  హామీలు సరిగ్గా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల్లో మళ్ళీ వారికి ఓటు వేస్తే ఎన్నికలు అయిపోయాక వీళ్ళు అమలు చేస్తారా? రైతన్నలు ప్రజలు ఆలోచించాలని కోరారు.కేసీఆర్ ప్రేమించే రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి ఈ మండుటెండలో కూడా పంటలు ఎండిన ప్రాంతాలకు వెళ్లి రైతులను కలుస్తూ వారికి భరోసా ఇస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఒక  న్యూస్ చానల్లో విలేఖరి రైతుల గురించి అడిగితే మంత్రి కోమటి రెడ్డి నేను మ్యాచ్ చూడటానికి వెళ్ళేది ఉందనడం  ఎంతవరకు సమంజసమని, ఇది రైతులపై ఈ ప్రభుత్వానికి ఉన్నా చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న 10 ఏండ్లలో  ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను రైతాంగానికి ఎప్పుడు ఇబ్బంది కలగకుండా చూసుకున్నాను అన్నారు.అది సాగునీరు, కరెంట్, పంట కొనుగోలు, రైతు బంధు ఇలా ప్రతి విషయంలో రైతులకు రోడ్డెక్కే పరిస్థితి లేకుండా చేశామన్నారు. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుమంటే మానవ బాంబు అవుతా, ప్యాంట్ ఉడగొడుతా, జేబులో కత్తెర పెట్టుకుంటా, పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతానంటూ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని  విమర్శించారు. జేబులో కత్తెర పెట్టుకొనేది దొంగ, మానవ బాంబు అయ్యేది ఉగ్రవాది అనే విషయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు.అయ్యా రేవంత్ రెడ్డి మరి నువ్వు ముఖ్యమంత్రివా? లేక దొంగవా? ఉగ్రవాదివా? అని ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు కర్రు కాల్చి వాత పెట్టాలని అప్పుడే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అన్నారు.
అరవింద్ పసుపు బోర్డు ఎక్కడ..
కేంద్రంలో అధికారంలో మేము భాగస్వామిగా లేకున్నా, ఎంపీగా కవితమ్మ పసుపు బోర్డ్ తేలేదని గత ఎన్నికల్లో ఆమెను రైతులు ఓడగొట్టారు.ఇప్పుడు 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా అన్న అరవింద్ ఇక్కడ ఎంపీగా అక్కడ  కేంద్రంలో వారి ప్రభుత్వం అధికారంలో ఉండి పసుపు బోర్డు తేలేదన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు రైతులు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.మళ్ళీ ఇప్పుడు అరవింద్ పసుపు బోర్డు సాధించాం అని చెబుతున్నారని, నేను అడుగుతున్న పసుపు బోర్డు సాధిస్తే ఆఫీస్ మెయిన్ దర్వాజ ఎక్కడ? ఆఫీస్ ఎక్కడ? ఆఫీస్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయన్నారు.ఆ ఆఫీస్ లో నీ కుర్చీ లేదా నా కుర్చీ చుయిస్తావ అని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న రైతులను పంపిస్తా వారికి  పసుపు బోర్డు ఆఫీస్ చూపించాలని డిమాండ్ చేశారు.ఇంకా ప్రజలను నీ అబద్ధపు మాటలతో ఏమార్చలేవన్నారు.మొన్న పసుపు ధర పెరుగగానే ఇది మా ఘనత అని జబ్బలు చరుచుకున్న బీజేపీ వాళ్లు, మరి ఇప్పుడు ఉన్న ధర కంటే రూ.5వేల ధర ఎందుకు తగ్గింది సమాధానం చెప్పాలన్నారు. అది మీ ఘనత కాదని, ధర లేదని వేల ఎకరాల్లో పసుపు పంట వేయడం రైతులు తగ్గించడంతో డిమాండ్ పెరిగి ధర పెరిగింది అంతే కాని ఇందులో అరవింద్  ఘనత లేదన్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచిన మా ప్రభుత్వం రాష్ట్రంలో  అధికారంలోకి రాకపోయినా నన్ను నమ్మి గెలిపించిన ప్రజల కోసం ఎప్పుడు ముందుంటానని, బయపడి వెనక్కి పోయేది లేదన్నారు.ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ప్రజల వైపు నిలబడకుండా కేవలం మూడు నెలలకే అధికార పార్టీలోకి పోయిన నీచుల గురించి ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి వారసత్వాన్ని తీసుకొని వచ్చిన మీ బిడ్డగా చెబుతున్న.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల తరపున పోరాడుతూ ఉంటాను..నాపై ఎన్ని కేసులు అక్రమంగా పెట్టాలని చూసిన వెనక్కి పోయేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్, బాల్కొండ, మెండోరా, ముప్కాల్ మండలాల రైతులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love