నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం.. దేశ రాజధానిని స్తంభింపచేసింది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ పలు రైతు సంఘాలు ఇవాళ ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీని కలిపే కీలక పాయింట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామైంది. ఛలో ఢిల్లీ నేపథ్యంలో పలు కూడళ్లలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఘాజిపూర్, చిల్లా బోర్డర్ల వద్ద కార్లు బారులు తీరాయి. ఘజియాబాద్, నోయిడా మార్గం కిక్కిరిసిపోయింది. డీఎన్డీ ఫ్లైఓవర్‌పై చిక్కుకున్న ఓ ప్రయాణికుడు గంట సమయంలో కేవలం ఒక్క కిలోమీటర్ దూరం మాత్రమే ప్రయాణించినట్లు చెప్పాడు. గంటలు గంటలు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎన్‌హెచ్-48 వద్ద ట్రాఫిక్ స్లోగా ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్ రూట్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వెహికల్ చెకింగ్ పాయింట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. ఘాజిపూర్, సింఘూ, టిక్రి బోర్డర్ ప్రదేశాలు శత్రుదుర్భేద్యంగా మారాయి. ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకునేందుకు భారీ బ్యారీకేడ్లను పెట్టారు. కాంక్రీట్ బ్లాకులను ఏర్పాటు చేశారు. ఇనుపు వైర్లు, మేకులను కూడా అమర్చారు. రైతు సంఘాలు గత రాత్రి ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. కానీ ఆ చర్చలు ఫలించలేదు. కనీస మద్దతు ధర చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.