– ముక్కలుగా చేయడంపై అన్ని కోణాల్లో పోలీసుల విచారణ
– సంచలన విషయాలు వెలుగులోకి..
– మాంసాన్ని బాగా ఉడికించేందుకు పోటాషియం హైడ్రాక్సైడ్ వాడినట్టు అనుమానం?
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ శివారు మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భార్యను అతి కిరాతకంగా హత్యచేసి, ముక్కలు ముక్కలుగా నరికిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారగా.. ఆధారాల సేకరణకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్య కేసుగా మార్చారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, క్లూస్ టీం బృందాలు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాయి. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు తన భార్యను దారుణంగా హత్యచేయడం, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి ఉడికించడం, ఎముకలను పొడి చేయడం అంత సులువైన పనికాదని గుర్తించిన పోలీసులు.. అసలు నిందితుడు గతంలో ఏం చేసేశాడని ఆరా తీశారు. ఈ క్రమంలో గురుమూర్తి ఆర్మీలో మాసం కొట్టే పని చేసినట్టు పోలీసులు అనుమానపడుతున్నారు.
ఈనెల 16న తెల్లారిజామున గురుమూర్తికి, భార్య వెంకట మాధివి మధ్య గొడవ జరిగింది. ఆ గోడవ తీవ్రస్థాయికి చేరడంతో కోపంతో కొట్టాడు. దాంతో ఆమె తల గోడకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులకు ఆనవాళ్లు చిక్కకుండా పథకం వేశాడు. అయితే, మృతదేహాన్ని ముక్కలు చేయడంతోపాటు మాంసాన్ని కుక్కర్‌లో ఉడికించడం సాధ్యమయ్యే పనికాదని, గదుల్లో రక్తం మరకలు పడకుండా మృతదేహాన్ని బాత్‌రూంలోకి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఎముకలను కాల్చేందుకు పెద్ద పొయ్యి(ఫంక్షన్స్‌లో వాడే స్టవ్)ని ఉపయోగించాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి మందంగా ఉండే కలర్ బకెట్(గోడలకు కలర్స్ వేసే బకెట్)లో వేశాడు. బకెట్‌లోనే వాటర్ హీటర్ సహాయంతో బాగా ఉడికించాడు. ఎముకలను సింగిల్ స్టౌవ్‌పై పెట్టి పెద్దమంటలో ఎముకలను, పుర్రె నల్లగా మారే విధంగా బాగా కాల్చాడు. వాటిని ఓ రోల్‌పై చూరచూరగా దంచాడు. మధ్యమధ్యలో మద్యం చేవిస్తూ కొద్దికొద్దిగా చూరను బాత్‌రూంలో వేసి నీళ్లు పోశాడు. మిగిలిన చూరను బకెట్‌లో తీసుకెళ్లి సమీపంలోని చెరువులో వేశాడు. ఆ తర్వాత బాత్‌రూంను, ఇంటిని ఫినాయిల్‌తో శుభ్రం చేశాడు. అయితే, ఈ పనిని 16న ఉదయం 10 గంటల నుంచి రాత్రి దాదాపు 7గంటల వరకు చేసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మాంసాన్ని ఉడికించేందుకు పోటాషియం హైడ్రాక్సైడ్ ఉపయోగించినట్టు అనుమానిస్తున్నారు.
కీలక ఆధారాలు సేకరణ
పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు గురుమూర్తి ఇంటిని మరోసారీ క్లూస్‌టీమ్‌తో కలిసి తనిఖీ చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గోడపై పడిన రక్తపు నమోనాలు, శరీర (చిన్నచిన్న ముక్కలు) అవయవాలు కాల్చిన ఆనవాళ్లను సేకరించారు. హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాల్చిన ఆనవాళ్లలో డీఎన్‌ఏ సేకరించారు. దొరికిన డీఎన్‌ఏతో పాటు మృతురాలి పిల్లల డీఎన్‌ఏ, వెంట్రుకలను ఫోరెన్సిక్‌కు పంపించారు. పిల్లల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అయితే, గురుమూర్తికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న అనుమానాల నేపథ్యంలో భార్యను వదిలించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. గురుమూర్తి ఉంటున్న ఇంటి నుంచి అవశేషాలను పడేసినట్టుగా చెబుతున్న జిల్లెలగూడ చెరువు వరకు ఉన్న అన్ని సీసీ కెమెరాల డీవీఆర్‌లనూ స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌టీమ్‌లు సైతం పరిశీలిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను శనివారం పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశముంది.