– ఓటుతో ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి
– సీపీఐ(ఎం)అభ్యర్థులను ఆదరించండి
– భద్రాచలం వెంకటాపురం, మధిర బోనకల్ సభల్లో పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్
నవతెలంగాణ- వెంకటాపురం/ బోనకల్
బీజేపీ, కాంగ్రెస్, బీఅర్‌ఎస్ బూర్జువా పార్టీలన్నీ ఒక్క తాను ముక్కలే అని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్ అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భద్రాచలం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్య గెలుపును ఆకాంక్షిస్తూ కుమ్మరి శ్రీను అధ్యక్షతన సోమవారం సభ జరిగింది. ఈ సందర్భంగా విజయరాఘవన్ మాట్లాడుతూ.. మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ, అవినీతిలో మునిగిపోయిన బీఆర్‌ఎస్, అసెంబ్లీ సీట్లను గుండుగుత్తగా అమ్ముకుంటున్న కాంగ్రెస్ పోటీలో ఉన్నాయన్నారు. ఆ నేతలంతా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొని మరోమారు అధికారంలోకి రావాలని యత్నిస్తున్నారని విమర్శించారు. పేదల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి పక్షాన నిలబడే సీపీఐ(ఎం) అభ్యర్థులు రాష్ట్రంలో 19 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారని, వారందరినీ ప్రజలు ఆదరించి గెలిపించాలని అన్నారు. కేరళ విద్యా, వైద్య రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అలాంటి రాజకీయ ప్రత్యమ్నాయం రావాలంటే ఎర్రజెండా నాయకత్వం వహిస్తున్న 19 మంది అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపించాలని అన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ మాట్లాడుతూ.. ప్రజల పక్షాన భద్రాచలం నియోజకవర్గ సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్యను గెలిపించాలన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రజా పథకాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ తప్ప ప్రజాసమస్యలు పట్టించుకున్నారా అని ఆలోచించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, సూడి కృష్ణారెడ్డి, గిరిజన సంఘ అధ్యక్షులు బీంరావు, సచిన్, ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మధిర నుంచి పాలడుగు భాస్కర్ విజయం ఖాయం : విజయరాఘవన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, దేశానికి ప్రమాదకరంగా మారాయని, ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలంటే శాసనసభ, పార్లమెంటుకు సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలని, ఆ విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ ఎల్‌డిఎఫ్ చైర్మెన్ విజయ రాఘవన్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాలడుగు భాస్కర్ విజయం కోరుతూ విజయ రాఘవన్ సోమవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. మధిర నియోజకవర్గం నుంచి పాలడుగు భాస్కర్ విజయం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి తెలంగాణ శాసనసభకు సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు గెలుస్తారనే సమాచారం తనకు ఉందన్నారు.
అసెంబ్లీలో మాట్లాడగలిగే ధైర్యం సీపీఐ(ఎం)కే ఉంది : వెంకట్
శాసనసభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మాట్లాడగలిగే గుండె ధైర్యం, దమ్మూ సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుందని, అటువంటి వారిని గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి. వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మధిర నియోజకవర్గం నుంచి పాలడుగు భాస్కర్ గెలుపుతోనే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్రంలో ఈసారి సీపీఐ(ఎం)కి చెందిన ప్రజాప్రతినిధులు అడుగుపెట్టబో తున్నారన్నారు. సీపీఐ(ఎం) దమ్ము, ధైర్యం, బలమేమిటో మధిరలో చూపించబోతున్నామని అన్నారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు, శ్రేణులు భాస్కర్ విజయం కోసం సైనికుల్లా పనిచేసి మల్లు భట్టి విక్రమార్కను, లింగాల కమల్‌రాజును ఓడించాలని పిలుపునిచ్చారు. సీఐటియు జాతీయ కోశాధికారి మందడపు సాయిబాబు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ ప్రచార సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్, సర్పంచ్ నోముల వెంకట నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.